నోరు మూసే న్యాయం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
న్యాయం బహిరంగంగా ఉండడం భారత్ లో న్యాయవ్యవస్థకు గీటు రాయి. సిద్ధాంత రీత్యా న్యాయస్థానాలలో విచారణను ఎవరైనా వినొచ్చు. పత్రికలు ఆ విచారణపై కథనాలు రాయొచ్చు. కాని ఆచరణలో విచారణ జరిగే గదులు అంత విశాలంగా ఉండకపోవడం, కిక్కిరిసి ఉండడం వల్ల అందరినీ విచారణ జరిగే చోటికి అనుమతించడం లేదు. న్యాయస్థానాల్లో జరిగే విచారణను తెలుసుకోవడానికి జనం పత్రికా రచయితల మీద ఆధారపడవలసి వస్తుంది. ఒక కేసు ప్రధానమైంది అనుకుంటే జనం ఆసక్తి ఆ మేరకు ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు విచారణకు విఘాతం కలగకుండా న్యాయస్థానాలు అపవాదులకు అవకాశం లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. దీని ఫలితం ఏమైనప్పటికీ విచారణా ప్రక్రియ ఎలా ఉంది అన్న అంశం మీదే న్యాయవ్యవస్థపై నమ్మకం ఆధారపడి ఉంటుంది. ఆ విచారణ న్యాయంగా, చట్ట ప్రకారం జరిగిందన్న నమ్మకం కుదురుతుంది. ప్రభుత్వ ఇతర వ్యవహారాలకు భిన్నంగా న్యాయ ప్రక్రియ బహిరంగంగా జరుగుతుంది. ప్రజలు ఆ ప్రక్రియను చూసి నిజాయితీగా విచారణ జరుగుతోంది అన్న నిర్ణయానికి రావచ్చు.
కాని ఈ సూత్రాన్ని న్యాయస్థానాలే పదే పదే ఉల్లంఘించడం దుఃఖ కారణం అవుతోంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో న్యాయస్థానాలు గమనిస్తున్నట్టు లేదు. సోహ్రాబుద్దీన్, ఇతరుల హత్య కేసులో అనేక మంది పోలీసు అధికారుల మీద కేసులో జరుగుతున్న విచారణకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ విద్వేషం రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు లో జరుగుతున్న విచారణకు పత్రికల వారు హాజరు కాకూడదని కట్టడి చేయడం నోరు మూయించడం కిందే లెక్క. ఏ లెక్కన చూసినా ఈ రెండూ ప్రధానమైన కేసులే. ఈ కేసుల్లో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి జనానికి ఉంటుంది.
పత్రికల వారిని విచారణకు అనుమతించకుండా చేసే ఈ రెండు ఉత్తర్వులు విభిన్నమైన పరిస్థితులలో జారీ అయినాయి. సోహ్రాబుద్దీన్ హత్య కేసులో ముంబైలో సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను పత్రికలలో ఏ రోజుకు ఆ రోజు పత్రికలలో ప్రచురిస్తే నిందితులు, రెండు పక్షాల సాక్షులు, న్యాయవాదులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించి న్యాయస్థానం పత్రికల వారు ఈ వార్తలను ప్రచురించకుండా నిరోధించింది. అయితే పత్రికల వారు విచారణ పూర్తి అయిన తర్వాత ఆ వివరాలు ప్రచురించడానికి అవకాశం ఉండవచ్చు. పత్రికల వారిని అనుమతించకూడదని నిందితుల తరఫు న్యాయవాది చేతి రాతలో పెట్టుకున్న అర్జీ ఆధారంగా న్యాయస్థానం ఈ కట్టడి చేసింది. అయితే కోర్టు ఈ నిర్ణయానికి ఏ ఆధారంతో వచ్చిందో తెలియదు.
ఆదిత్యనాథ్ కేసును విచారిస్తున్న అలహాబాద్ హై కోర్టు మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ కోర్టు విచారణ గురించి పొరపాట్లతో రాస్తున్నారని ఫిర్యాదు చేసినందువల్ల విలేకరులకు అనుమతి నిరాకరించారు. తీర్పు వెలువడే దాకా వార్తలు రాయకూడదని కట్టడి విధించారు. కోర్టు విచారణ గురించి పొరపాటున రాసిన వార్తలేమిటో, ఏ విలేకరి అలా పొరపాటు వార్తలు రాశారో మాత్రం న్యాయస్థానం తెలియజేయలేదు. అయినా విచారణ పూర్తి అయ్యేదాకా అసలు ఏ వార్తలూ రాయకూడదని నిషేధం విధించారు.
ఈ రెండు సందర్భాలలోనూ సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ కు సెబీకి మధ్య 2012 నాటి 10 ఎస్.సి.సి. 603 కేసులో సుప్రీం కోర్టు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. మీడియా వార్తలు రాయకూడదని ఆంక్ష విధించేటప్పుడు ఆ కేసు ప్రాధాన్యతను, అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. మీడియాలో వార్తలు రాకుండా నిరోధించడం తప్ప మరో మార్గం లేదని కోర్టులు నిర్ధరించుకోవాలని, ఈ నిరోధం అవసరమైనంత కాలమే ఉండాలని, అది విచారణలో జోక్యం లేకుండా చూడడానికి మాత్రమే అయి ఉండాలని న్యాయ మూర్తులు చెప్పారు. పైన పేర్కొన్న రెండు కేసుల్లో విచారణ క్రమాన్ని ప్రచురించకుండా పత్రికల మీద ఆంక్ష విధించేటప్పుడు సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాన్ని పరిగణించలేదు.
మీడియా నోరు నొక్కింది ఈ రెండు న్యాయస్థానాలే అనడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఈ పనే చేసి ఈ సంప్రదాయాన్ని నెలకొల్పింది. ఉజ్జయిని మాహాకాళేశ్వర దేవాలయానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు విచారణకు సంబంధించిన వార్తలు రాయకూడదని సుప్రీం కోర్టు పత్రికా రచయితలను మౌఖికంగా కోరింది. నిజానికి పొరపాటుగా వార్తలు రాయకుండా నివారించడం కోసం ఈ ఆంక్ష విధించినా తీరా తీర్పు వెలువడిన తర్వాత ఆ వార్త పొరపాటుగానే రాశారు. కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి సి.ఎస్.కర్ణన్ కోర్టు ధిక్కారం కేసులో కూడా దానికి సంబంధించిన వార్తలు ఏవీ రాయకూడదని ఆంక్ష విధించారు. ఈ నిర్ణయంలో వాక్ స్వాతంత్ర్యాన్ని గూర్చి న్యాయస్థానం అనాలోచిత చర్య తీసుకుంది.
వాక్ స్వాతంత్ర్యానికి, న్యాయం అందజేయడానికి మధ్య సమతూకం ఉండేలా చూడడం సులభం కాదని సహారా కేసులో సుప్రీం కోర్టు తెలియాజేసింది. కాని ఇటీవల విధించిన ఆంక్షలు వాక్ స్వాతంత్ర్యానికి, న్యాయం అందజేయడానికి కూడా విఘాతం కలిగించాయి. నిరాధారంగా పత్రికా రచయితలు రాయకుండా ఆంక్షలు విధించారు. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడంలో ఉచితానుచితాలు ఏమిటి అని ప్రజలు ప్రశ్నించే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ప్రధానమైన కేసుల్లో ఈ ప్రశ్న తలెత్తుతుంది. న్యాయం ఎలా జరుగుతుందో ప్రజలు గమనించే అవకాశం ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుంది. ప్రధానమైన కేసులకు సంబంధించి వార్తలు రాయడాన్ని నిరోధించడం ద్వారా న్యాయస్థానాలు వాక్ స్వాతంత్ర్యానికి విఘాతం కలిగించడమే కాకుండా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వానికి కూడా భంగం కలిగించినట్టు అవుతోంది.