ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అమెరికా ఆధిపత్యానికి భారత్ వత్తాసు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నవంబర్ మధ్యలో మనీలాలో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్, ఆస్టేలియా, జపాన్, అమెరికా దేశాల ఉన్నతాధికారులు విడిగా సమావేశమై హిందూ మహా సముద్ర-పసిఫిక్ ప్రాంతంలో నౌకాయానంలో, విమానాల రాకపోకల్లో "నిబంధనల ఆధారిత వ్యవస్థ"ను ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని నిర్ణయించాయి. ఈ వ్యూహం చైనాను నిలవరించడానికి ఉద్దేశించింది. కాని ఆ మాట ఎక్కడా చెప్పలేదు. అదీగాక ఈ నాలుగు దేశాలు "హిందూ మహాసముద్రం-పసిఫిక్ ప్రాంతంలో సముద్రయాన భద్రత" ను పరిరక్షించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి తెలియజేశారు. ఉత్తర కొరియా క్షిపణుల వల్ల ఏర్పడే ముప్పుతో పాటు అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కుంటామని కూడా అన్నారు.

ఈ నాలుగు దేశాల కూటమి "అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడం, నిబంధనల ఆధారిత వ్యవస్థ" ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఎన్నడూ ఈ నిబంధనలను ఖాతరు చేయలేదని గమనించినట్టు లేదు. అమెరికా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును లెక్క చేసిన దాఖలాలూ లేవు. ఐక్య రాజ్య సమితి అనుమతి లేకపోయినా ఏ దేశంలోనైనా సైనిక జోక్యానికి అమెరికా పాల్పడుతుంటుంది. తాను "తీవ్రవాదులు" అనుకునే వారిని సుదూర ప్రాంతం నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగించి హతమారుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో అనేక మంది పౌరులు కూడా మరణిస్తుంటారు. అది "అనివార్యమైన నష్టంగా" చెలామణి చేస్తుంది. ఇలాంటి చట్ట బాహ్యమైన, దౌర్జన్యకరమైన సామ్రాజ్యవాద దాడులను భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల పౌరులు అంగీకరించాలా?

2007లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ "చతుష్టయాన్ని" ఏర్పాటు చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని ఆమోదించారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా, భారత్ కలిసి ఇప్పటికే ఉమ్మడిగా "ఎక్సర్సైజ్ మలబార్" పేర ఉమ్మడిగా నౌకా విన్యాసాలు జరుపుతున్నాయి. ఈ విన్యాసాలు 1992 నుంచి కొనసాగుతున్నాయి. జపాన్ నౌకాయాన ఆత్మ రక్షణ బలగాలతో కలిసి 2007లో జపాన్ దీవి ఒకినావాలో ఈ విన్యాసాలు నిర్వహించారు. బంగాళాఖాతంలో జరిగిన విన్యాసాలలో ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా భాగస్వాములైనాయి. తద్వారా మలబార్ విన్యాసాలు ద్వైపక్షిక ఒప్పందం పరిధిని అతిక్రమించాయి. అయితే ఆస్ట్రేలియా 2008లో ఈ మలబార్ విన్యాసాల నుంచి ఉపసం హరించుకుంది. కాని ఆస్ట్రేలియా ఇతర చోట్ల అమెరికాతో సైనిక బంధాన్ని తెంచుకోలేదు. 2015 నుంచి జపాన్ క్రమం తప్పకుండా ఈ సైనిక విన్యాసాలలో పాలు పంచుకుంటోంది. మళ్లీ ఇప్పుడు నాలుగు దేశాలతో కూడిన చతుష్టయాన్ని పునరుద్ధించినందువల్ల భారత్ నిర్వహించే విన్యాసాలలో ఆస్ట్రేలియా కూడా భాగస్వామి అయ్యే అవకాశం ఉంది.

మరి భారత్ జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి నిర్వహించే విన్యాసాలను ట్రంప్ ప్రభుత్వం ఎలా చూస్తుందో గమనించాలంటే అక్టోటోబర్ లో వాషింగ్టన్ డి.సి.లోని వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయన వేదిక మీద "వచ్చే శతాబ్దంలో భారత్ తో మన సంబధాలు" అన్న అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ ప్రసంగాన్ని గమనించాలి. చైనాను నిలవరించడానికి భారత్, అమెరికా, జపాన్ ప్రయత్నాలలో ఆస్ట్రేలియా కూడా భాగస్వామి కావాలని ట్రిల్లెర్సన్ అన్నారు. చతుష్టయాన్ని పునరుద్ధరించడాన్ని భారత్ వెంటనే ఆమోదించింది. అయితే దీనికి అనుసరించే పద్ధతులు, విధి విధానాలు ఏమిటో ఇంకా తేలవలసి ఉంది. భారత్ ఇప్పటికే అమెరికాకు "భారీ రక్షణ భాగస్వామి". దీని వల్ల అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి దగ్గర నుంచి భారత్ అధునాతన ఆయుధాలు కొనడానికి వీలవుతుంది. దీని కోసం ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత సైనిక స్థావరాలను అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు వినియోగించుకుంటాయి.

చైనాను నిలవరించాలన్న అమెరికా ప్రయత్నాలను మనం ఎందుకు సమర్థించాలన్నది ప్రశ్న. చైనాలో ఆర్థికాభివృద్ధి జరిగిన స్థాయిలో ఆ దేశ సైనిక, భౌగోళిక రాజకీయ శక్తి పెరగలేదు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికాదే పై చేయి. సైనిక బడ్జెట్, సైన్యం, అణ్వస్త్రాలు, విదేశాలలో సైనిక స్థావారాలు మొదలైన వాటిలో ఏ దేశమూ అమెరికా దరిదాపుల్లో కూడా లేదు. అయినా చైనా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం వల్ల బీజింగ్ కు భౌగోళిక రాజకీయాలలో పలుకుబడి పెరగడం వల్ల ఆసియా-పసిఫిక్ లో అమెరికా ఆధిపత్యానికి భంగం కలిగింది. అమెరికా భద్రతకూ ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది.

తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాల వివాదాలకు సంబంధించినంతవరకు ఎవరూ ఏ పాపం ఎరగని వారేమీ కాదు. ఈ విషయంలో ఇతర దేశాల వాదనలు చైనా వాదనలంత అసంబద్ధమైనవే. ఈ విషయంలో నానా యాగీ చేస్తున్న అమెరికా ఇప్పటికీ సముద్ర చట్టాలకు ఆమోదం తెలపనే లేదు. అంతర్జాతీయ చట్టం, నౌకాయానానికి స్వేచ్ఛ ఉండాలని ఎంతగా వాదిస్తున్నా చైనా ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించేలా అమెరికా సైన్యానికి వాణిజ్యాన్ని అడ్డుకునే శక్తి ఉండనే ఉంది. సమస్య ఉన్నది వాణిజ్యపరమైన నౌకాయానానికి విఘాతం కలగడం కాదు. దీనికి చైనా అడ్డంకి అన్న వాదన నిలబడేది కాదు. తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాల్లో వాణిజ్యపరమైన రవాణాకు చైనా అడ్డుతగులుతుందని సవ్యంగా ఆలోచించే వారు ఎవరూ అనలేరు. తన ప్రయోజనాలను చైనా తానే ధ్వంసం చేసుకోదు. "నిబంధనల ఆధారంగా అంతర్జాతీయ వ్యవస్థ" ఏర్పడాలని ఈ నాలుగు దేశాలు చేస్తున్న ప్రయత్నం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడమే.

Updated On : 19th Apr, 2018
Back to Top