ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వెంటాడుతున్న డిసెంబర్ 6 బాబ్రీ విధ్వంసం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) అధిపతి మోహన్ భగవత్ గత నవంబర్ 24 న రామ మందిర నిర్మాణం తథ్యం అని పునరుద్ఘాటించారు. "రామ మందిర నిర్మాణం వాస్తవం. ఇది మారదు. మందిర నిర్మాణం వాస్తవ రూపం దాల్చే రోజు దగ్గరలోనే ఉంది. అది సాధ్యం కావడానికి మనం ప్రయత్నించాలి" అని భగవత్ నొక్కి చెప్పారు. భగవత్ మాటలు హిందుత్వ వాదులకు కార్యోన్ముఖులు కావాలని పిలిపు ఇవ్వడమే.

ఆయన ఈ ప్రకటన చేయడంలో ఆశ్చర్యం లేదు. ఈ మాట చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న చోటు, సమయం, సందర్భం కూడా ప్రధానమైనవే. కర్నాటకలోని ఉడుపిలో విశ్వహిందూ పరిషత్తు ఏర్పాటు చేసిన ధర్మ సన్సద్ లో ఆర్.ఎస్.ఎస్. నాయకుడు ఈ విషయం ప్రస్తావించారు. ఆయన ఎంచుకున్న సమయానికీ ఓ విశిష్టత ఉంది. బాబరీ మసీదును 1992 డిసెంబర్ 6న ధ్వంసం చేశారు. ఈ సంఘటన జరిగి పాతికేళ్లయిన సందర్భాన్ని అదునుగా తీసుకుని దాదాపు రెండు వారాల ముందు ఆయన మళ్లీ ఆ అంశాన్ని రేకెత్తించారు. బాబరీ మసీదు స్థల వివాదంపై అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలును సుప్రీం కోర్టు విచారణ చేపట్టడానికి కొద్ది రోజుల ముందు భగవత్ ఈ అంశం ప్రస్తావించారు. 2.77 ఎకరాల వివాదాస్పదమైన మునుపు బాబరీ మసీదు ఉన్న స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, రాం లల్లా (శ్రీ రాముడు), నిర్మోహీ అఖాడా పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఈ మూడు సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఆ కేసునే సుప్రీంకోర్టు విచారించబోతోంది.

భగవత్ రామ మందిర అంశాన్ని లేవనెత్తడానికి మరో కారణం గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. మందిర నిర్మాణాన్ని బీజేపీ విస్మరించకూడదన్నది ఆయన ఉద్దేశం. బాబరీ మసీదు వివాదాన్ని రేకిత్తించినందువల్లే బీజేపీ రాజకీయంగా ఎదిగింది. 2014 నుంచి బీజేపీ ఈ వివాదాన్ని ఎన్నికలలో చర్చనీయాంశం చేయడం లేదు. కాని అభివృద్ధి అన్న మాట జనాన్ని ఆకర్షించకపోతే బీజేపీ మళ్లీ ఆ విషయాన్ని రేకిత్తిస్తుందనడంలో సందేహం లేదు. గుజరాత్ లో ఆ ఛాయలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రామజన్మ భూమికి సంబంధించినంత వరకు బీజేపీకి, ఆర్.ఎస్.ఎస్. కు మధ్య అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. గునపాలు, పలుగులు, పారలు తీసుకుని 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబరీ మసీదు రాయి రాయి విడగొట్టినప్పుడే ఈ విషయంలో బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం ఒకటేనని తేలిపోయింది. చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడానికి మసీదును పడదోసామని అప్పుడు ఈ వర్గాల వారు చెప్పారు. మసీదును కూల్చి వేయడం ద్వారా స్వతంత్ర భారత చరిత్రను వారు తిరగదోడారు.

బాబరీ మసీదును కూల్చివేసిన రోజున బి.బి.సి. ఆ విధ్వంస దృశ్యాలను ప్రసారం చేసింది. అప్పటికి మనకు ఇన్ని టీవీ ఛానళ్లు లేవు. అప్పుడే దేశంలో గొడవలు తప్పవని తేలిపోయింది. చరిత్రను చెరిపేసి తిరగరాయాలన్న హిందుత్వ వాదుల ప్రయత్నం దేశవ్యాప్తంగా ముఖ్యంగా బొంబాయిలో విధ్వంసానికి దారి తీసింది. దేశమంతటా అల్ల కల్లోలం చెలరేగింది. అనేక సంస్కృతులకు ఆలవాలమౌంకునే ముంబై మత కలహాల వల్ల వికలమై పోయింది. దేశ వ్యాప్తంగా చెలరేగిన మత కలహాల్లో వండలాది మంది మరణించారు. బాబరీ విధ్వంసం వల్ల కిరాతకం, విద్వేషం కనీవినీ ఎరగని రీతిలో మన మూలుగలను పీల్చేస్తాయని అప్పుడు మనకు అర్థం అయి ఉండకపోవచ్చు. కాని ఆ ప్రభావం ప్రస్తుతం సర్వత్రా అనుభవంలోకి వస్తోంది. మసీదు విధ్వంసానికి కారకులైన వారికి శిక్ష పడ లేదు. విధ్వంసానికి కుట్ర పన్నిన వారికీ, ప్రోత్సహించిన వారికీ ఏ శిక్షా పడలేదు. అందుకే ఈ దారుణ ఘటన ఇంకా జనం మనసుల్లోంచి చెదిరిపోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వివిధ పార్టీల వారు దోషులకు శిక్ష పడేట్టు చేయడానికి చేసిన ప్రయత్నమూ లేదు. పైగా మసీదు విధ్వంసం మెజారిటీ మతస్థుల్లో మతోన్మాద వైఖరిని పెంపొందింప చేసింది. మత వ్యవహారాల విషయంలో అంతగా ఆసక్తి చూపని వారు కూడా మతోన్మాద భావాలకు లొంగి పోతున్నారు.  గత 25 సంవత్సరాల కాలంలో మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టే ప్రయత్నాలు పెచ్చరిల్లి పోయాయి.

 పాతికేళ్ల కాలంలో బీజేపీ రాజకీయాల్లో బాగా బలపడడమే గాక ముస్లింలు భయకంపితులయ్యారు. గత వారమే పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో నమాజ్ చేసుకునేటప్పుడు ధరించే టోపీలున్న ముగ్గురిని ఒక రైలులో చితకబాదారు. "మీరు టోపీలు పెట్టుకుంటారా? మీకు తగిన గుణపాఠం చెప్తాం" అని దాడికిదిగిన వారు అవహేళన చేశారు. బెదరగొట్టారు. కేవలం ముస్లిం అయినందువల్ల 16 ఏళ్ల జునైద్ ను కొట్టి చంపిన ఉదంతాన్ని విస్మరించలేం. ఒక చారిత్రక కట్టడాన్ని పడదోసి అణచివేతకు ప్రతిరూపమైన మరో కట్టడాన్ని నిర్మిస్తామనడం భయంకరమైన పరిణామం.

సాంస్కృతిక జ్ఞాపకాలు, సంప్రదాయం, చారిత్రక సత్యాలు మొదలైనవాటిని తుడిచిపెట్టే దురాగతం కొనసాగుతోంది. హేతుబద్ధమైన ఆలోచన మృగ్యం అవుతోంది. మునుపు బాబరీ మసీదు ఉన్న చోటే రామజన్మస్థలం అని వాదించడం సంప్రదాయానికి, చారిత్రక సత్యానికి మధ్య ఉన్న గీతను చెరిపి వేయడమే. 1992 డిసెంబర్ 6 నాటి సంఘటన "హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడానికి" ఉపకరించింది. "మైనారిటీలను అణచివేయడానికి" ఉపకరించింది. ముంబైకి సంబంధించినంత మేరకు బాబరీ విధ్వంసానికి కారణమైన రాజకీయపక్షమే ఇప్పుడు అధికారంలో ఉంది. బాబరీ విధ్వంసానికి బాధ్యులైన వారికి ఎవరికీ శిక్ష పడలేదు. అందుకే ఆ దారుణం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top