ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

హాదియా పురుషుడై ఉంటే

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

1980లలో షా బానో, రూప్ కన్వర్, ఆ తర్వాత 30 ఏళ్లకు ఇప్పుడు హాదియా - పరిస్థితి ఏ మాత్రం మారినట్టు లేదు. మహిళల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాద వివాదాలు, చర్చలు వారిని వ్యక్తులుగా గుర్తించి, వారి హక్కులను పరిగణనలోకి తీసుకుని జరగవు. ఆ వాద వివాదాలన్ని వాళ్ల కుటుంబం, మతం, రాజకీయాలు, సంప్రదాయాలు, సంస్కృతి చుట్టే తిరుగుతాయి.

1985లో వయసు మళ్లిన, నిరుపేద, భర్త వదిలేసిన ఓ మహిళ జీవనభృతి కోసం చాలా తక్కువ మొత్తంలో భరణం అడిగితే ఆ వ్యవహారం అంతా రాజకీయ అంశంగా, మత స్వేచ్ఛ, అస్తిత్వం, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన చర్చగా మారిపోయింది. 1987లో 18 ఏళ్ల ఓ యువతి తన భర్త మరణం తర్వాత అతని చితిమీదకు ఎక్కి సతీ సహగమనానికి పాల్పడవలసి వచ్చింది. ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు ఈ వ్యవహారాన్ని రాజకీయ శక్తిగా వినియోగించుకోవడానికి, చట్ట వ్యతిరేకమైన సతీ సహగమనాన్ని పునరుద్ధరించడానికి వాడుకున్నారు. 2017లో ఒక యువతి, వయోజనురాలైన హాదియా రాజ్యాంగం హామీ ఇచ్చిన మేరకు తన జీవితభాగస్వామిని ఎంపిక చేసుకున్నారు. అదీ రాజకీయ రగడగా, తీవ్రవాదంపై చర్చగా, జాతీయ భద్రతపై చర్చగా మారింది. ఈ అన్ని సందర్భాలలోనూ మహిళల స్థితి, పౌరులుగా వారికి ఉన్న హక్కులు ప్రశ్నార్థకం అయినాయి. కాని ఈ అంశాలపై జరిగిన వాదాలన్ని కీలకమైన లింగ సమానత్వం, న్యాయం గురించి మాత్రం చర్చించలేదు.

నవంబర్ 27వ తేదీన హాదియా వ్యవహారంలో సుప్రీంకోర్టులో జరిగిన చర్చలో ఆమె స్త్రీత్వం గురించి చర్చించడానికి నిరాకరించకపోయినా, ఆ అంశం చుట్టే చర్చంతా జరిగింది. అక్టోబర్ లో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచి హాదియాను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అప్పుడే ఆమె తన సొంత నిర్ణయం ప్రకారం ఇస్లాం మతంలోకి మారారా లేదా, తన ఇష్టపూర్వకంగా షఫీ జహాన్ ను పెళ్లి చేసుకున్నారా లేదా నిర్ధరించుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. హాదియా నోటి ద్వారానే ఆమె ఆకాంక్ష ఏమిటో తెలుసుకోవాలని న్యాయమూర్తులు భావించారు. కాని ఒక నెల తర్వాత ఆమెను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన తర్వాత తన గురించి ఆమె స్వయంగా మాట్లాడవచ్చునా లేదా అన్న విషయంలో మిమాంస లేవదీశారు. సుదీర్ఘ చర్చ చేశారు. చివరకు ఆమె తరఫు న్యాయవాది, మాజీ అదనపు సోలిసిటర్ జనరల్ ఇందిరా జై సింగ్ హాదియా కనక పురుషుడైతే న్యాయమూర్తులు ఇంతగా తటపటాయించే వారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినందుకు న్యాయమూర్తులు ఆగ్రహించారు. "ఇక్కడ ఆడా మగా అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది?" అని ప్రధాన న్యాయ మూర్తి ఆగ్రహంగా అడిగారు.

ఈ కేసును అంతకు ముందు విచారించిన హైకోర్టు "24 ఏళ్ల ఆ అమ్మాయి బలహీనంగా ఉంది. ఆమె అనేక రకాలుగా పీడనకు గురి కావచ్చును" అన్న తర్వాత ఆమె ఆడా, మగా అన్న ప్రస్తావన రాకుండా ఎందుకుంటుంది. ఆమె "సులభంగా మోసపోయే అవకాశం ఉన్న మనిషి" అందువల్ల ఆమె స్వతంత్రంగా ఉండడానికి వీలు లేదని, అందువల్ల భారత సంప్రదాయం ప్రకారం అవివాహిత అమ్మాయి, సవ్యంగా పెళ్లి జరిగేదాకా తల్లిదండ్రుల పెంపకంలో ఉండాలని హైకోర్టు భావించింది. సంఘ్ పరివార్ కు చెందిన సంస్థలు "లవ్ జిహాద్" మీద అంత రగడ చేస్తున్నప్పుడు ఆమె ఆడో మగా అన్న ప్రశ్న తలెత్తకుండా ఎలా ఉంటుంది. సంఘ్ పరివార్ దృష్టిలో మహిళలకు సొంత బుర్ర ఉండదు. వారిని కేవలం మతం మార్పించడం కోసం ప్రేమ అనే మొగ్గులోకి దించుతారు. వాస్తవం ఏమిటంటే హాదియా విషయంలో లవ్ జిహాద్ అన్న మాట వర్తించదు. తాను ఏడాది కిందే మతం మార్చుకున్నానని, షఫీ జహాన్ ను పెళ్లి చేసుకున్నాని, ఆన్ లైన్ లో తమ మధ్య సంబంధం ఏర్పడడానికి నెల ముందే తాను మతం మారినట్టు ముస్లిం మైనారిటీ వెబ్ సైట్ నుంచి సర్టిఫికేట్ కూడా వచ్చిందని హాదియా బహిరంగంగానే చెప్పారు.

ఆ అమ్మాయి తన ఆలోచనలను, భావాలను, కోర్కెలను రెండేళ్ల కాలంలో అనేక సార్లు బహిరంగంగా వ్యక్తం చేసిన తర్వాత ఆమె ఆడో, మగో అన్న ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది. ఆమెను ఇప్పటికీ తనకు ఏం కావాలో నిర్ణయించుకోగలిగిన శక్తి ఉన్న వయోజనురాలిగా పరిగణించడం లేదు. నెలల తరబడి ఆమెను దాదాపు ఏకాంత వాసంలో ఉంచారు. కుటుంబ సభ్యులను తప్ప మరెవరినీ కలుసుకునే అవకాశం ఇవ్వ లేదు. పోలీసుల పహరాలో ఉంచారు. మానసిక వేధింపులకు గురిచేశారు. అయినా ఆమె మాట్లాడలేదు. నిబ్బరంగా ఉన్నారు. తనకేం కావాలో స్పష్టంగా చెప్పారు. తనకు ఇష్టం వచ్చిన రీతిలో స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఆమె సందిగ్ధతకు తావు లేకుండా తనకు స్వేచ్ఛ కావలని, తనను బందీగా ఉంచకూడదని చెప్పిన తర్వాత ఆమే ఆడో, మగో అన్న అంశం చర్చకు రాకుండా ఎలా ఉంటుంది? వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, గౌరవం గురించి ఆమెకు పరంపరాగత ఉపదేశాలు చేశారు. ఆ తర్వాత ఆమెకు పాక్షిక స్వేచ్ఛ మాత్రమే కల్పిస్తామన్నారు. ఆమె డిగ్రీ సంపాదించడానికి అవసరమైన శిక్షణ పొందడానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. కళాశాల వసతి గృహంలో ఉండేందుకు అంగీకరిస్తామన్నారు. వసతి గృహ నియమాలు పాటించాలన్నారు.

కళాశాల డీన్ ఆమెకు సంరక్షకుడిగా ఉంటారని అన్నా, ఆయన అధీనంలో ఉండాలని న్యాయస్థానం చెప్పిన తుది ఉత్తర్వులో ఆ మాటే చెప్పాలెదు. ఆ సంరక్షకుడు చెప్పిన మాటలు, ఆమె చెప్పిన మాటలనుబట్టి ఆమె ఎలా వ్యవహరించాలో సంరక్షకుడు నిర్ణయిస్తారు. ఆమె ఎక్కడికి వెళ్లొచ్చో, ఎక్కడికి వెళ్లకూడదో కూడా ఆయనే తేలుస్తారు. అయితే హాదియా తండ్రికి ఈ నిబంధనలు నచ్చ లేదు. మళ్లీ కోర్టుకు వెళ్తానని బెదిరించారు కూడ. హాదియా వ్యవహారం కేవలం లింగ వివక్షకు పరిమితమైందే కాదు. అందులో మత రాజకీయాలు, ఇస్లాం అంటే ద్వేషం, తీవ్ర వాదం అన్న ఆరోపణలు ప్రజల మనసుల్లోనూ ఉన్నాయి. న్యాస్థానం అభిప్రాయాల్లోనూ ఉన్నాయి. అయితే ఆమె అమ్మాయి అయినందుకే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్న విషయాన్ని విస్మరించకూడదు. 

Back to Top