ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తృతీయ లింగం వారి హక్కులను హరించే బిల్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

జననాంగాల లోపాలతో జన్మించిన వారు, తృతీయ లింగానికి చెందిన వారు చాలా పోరాటాలు చేసి, కోర్టులకెక్కి కొన్ని హక్కులు సంపాదించుకున్నారు. కాని ఈ హక్కులను కాలరాసేట్టుగా ఓ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం ఈ వర్గాల వారికే కాక, వారి హక్కుల కోసం పోరాడుతున్న వారికి కూడా దిగ్భ్రాంతి, ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 2016నాటి తృతీయ లింగ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) బిల్లు 2014లో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులకు, 2015లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. 2015లో రాజ్యసభలో ఈ అంశంపై ఓ ప్రైవేటు సభ్యుల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పు, ప్రైవేటు సభ్యుల బిల్లు మొదలైనవన్నీ తృతీయలింగానికి చెందిన వారి సమస్యలను బాగా అవగాహన చేసుకున్నవే. ప్రభుత్వ చర్యలో అంతకన్నా ఘోరమైంది ఏమిటంటే ఈ వర్గం వారి సమస్యలపై సామాజిక న్యాయం, సాధికారికతపై పార్లమెంటరీ స్థాయీ సంఘం 43వ నివేదికలో చేసిన సూచనలను ప్రభుత్వం తిరస్కరించింది.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు అసలు తృతీయ లింగం అన్న మాటను నిర్వచించడంలోనే తిరోగమన దృష్టితో వ్యవహరించింది. తృతీయ లింగం వారికి ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న అంశాన్ని నిరాకరించింది. ఈ వర్గం వారిని వారి కుటుంబ సభ్యులే ఆదరించరు కనక వారికి ఓ కుటుంబం ఉండాల్సిన అగత్యం ఉంది. వారి విద్యాస్థాయి, ఆర్థిక పరిస్థితి చాలా హీన స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా ప్రభుత్వం బిల్లు రూపొందించింది. మానవాభివృద్ధికి లింగం కీలకమైంది. తృతీయ లింగం వారికి ఓ గుర్తింపు అవసరం. తమది అన్న భావన వారికీ ఉండాలి అన్న విషయాన్ని ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్నారు. ఒక వ్యక్తి "లైంగికత" జీవశాస్త్ర సంబంధమైంది అయితే "లింగం" సామాజికమైంది అన్న అంశంలో వివాదాలకు తావు లేదు. కాని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తృతీయ లింగం అన్న మాటకు బిల్లులో ఇచ్చిన నిర్వచనం హాస్యాస్పదంగా ఉంది. ఆ నిర్వచనంలో ఇలా పేర్కొన్నారు: "తృతీయ లింగానికి చెందిన వ్యక్తి అంటే పూర్తిగా పురుషుడూ కాదు, పూర్తిగా స్త్రీ కాదు. వారి లింగం జన్మతః వచ్చింది కాదు. వారిలో లింగపరమైన లోపాలతో పుట్టిన పురుషులూ ఉంటారు. స్త్రీలూ ఉంటారు. ద్విలింగులూ ఉంటారు. వారి లింగం వింతగా ఉంటుంది." తమను సామాజికంగా, న్యాయపరంగా, వైద్యపరంగా స్త్రీలు, పురుషులు కాని వారిగా నిర్వచించాలని తృతీయ లింగం వారు కోరుతున్నారు. అయితే ఇది తమ సొంత గుర్తింపు కాదని, తమ భావన అది కాదని అంటున్నారు. తృతీయ లింగానికి చెందిన వారు ఉభయలింగత్వం కలిగిన వారు కావచ్చు, కాకపోవచ్చు. ఉభయలింగానికి చెందిన వారు లేక ద్విలింగులకు శరీర నిర్మాణ పరంగా, క్రోమోజోముల పరంగా, హార్మోన్ల పరంగా మామూలు వారికి ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. సామాజికంగా, న్యాయపరంగా, వైద్యపరంగా వారు ఆడా కాకపోవచ్చు, మగా కాకపోవచ్చు.

2015లో జాతీయ న్యాయ సేవల వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో సుప్రీంకోర్టు భౌతిక పరీక్షలకు గురి చేయకుండా తృతీయ లింగానికి చెందిన వారికి స్వయం గుర్తింపు ఉండడానికి అవకాశం ఇవ్వాలని తీర్పు చెప్పింది. ప్రస్తుతం తృతీయ లింగానికి చెందిన వారు తమను ఏ లింగానికి చెందిన వారిగా గుర్తించాలో ప్రమాణపత్రం దాఖలు చేయడం ద్వారా తెలియజేయవచ్చు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ఈ వెసులుబాటు తొలగించి లింగ నిర్ధారణ కోసం జిల్లా స్థాయిలో ప్రధాన వైద్యాధికారి, మానసిక శాస్త్రవేత్త మొదలైనవారితో ఒక సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలాంటి పద్ధతివల్ల అధికారవర్గాల వారి వేధింపులకు, సాచివేత ధోరణికి ఎంతగా గురి కావలసి వస్తుందో చెప్పనక్కర లేదు. తృతీయ లింగం వారు సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనం పొందాలంటే ఏ కులానికి చెందిన వారో లేదా తమకు ఫలానా వైకల్యం ఉందనో సర్టిఫికేట్ అందజేయవలసి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ "రాజ్యాంగం 'లింగం' గురించి పట్టించుకోదని, ఒక వ్యక్తి లింగం ప్రధానం కాదని, మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేయవలసి ఉంటుంది" అని ఆ సంఘానికి ఇచ్చిన జవాబులో తెలియజేసింది.

తృతీయ లింగానికి చెందిన వారు తమ కుటుంబాల నుంచి మద్దతు, అవగాహన పొందలేరన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లులో విస్మరించారు. తృతీయ లింగానికి చెందిన వారిని కోర్టు ఉత్తర్వు ద్వారా తప్ప వారి కుటుంబం నుంచి విడదీయకూడదని, ఇది వారి ప్రయోజనం కోసమేనని, ఒక వేళ కుటుంబం నుంచి వేరు చేయడం అనివార్యం అయితే, వారి కుటుంబం వారు వారి పోషణ భారం స్వీకరించకపోతే వారిని పునరావాస కేంద్రంలో ఉంచాలని బిల్లులో తెలియజేశారు. కుటుంబం అన్న నిర్వచనం కిందకు హిజ్రాల(కొజ్జాలను)ను, అరవానీల వర్గానికి చెందిన వారిని కూడా చేర్చాలని, అప్పుడు వారు తృతీయ లింగానికి చెందిన పిల్లల సంరక్షణ బాధ్యత చేపడ్తారని, హిజ్రా కుటుంబాలను నేరస్థులుగా పరిగణించకూడదని తృతీయ లింగానికి చెందిన వారు కోరుతున్నారు. అలాగే ఈ బిల్లు ఆరోగ్యం, సానుకూల చర్యలనుంచి వీరిని పరిహరిస్తోంది. అంటే వారి మానానికి వారిని వదిలేస్తోంది. తృతీయ లింగానికి చెందిన వారి మీద అఘాయిత్యాలకు పాల్పడితే చర్య తీసుకోవడానికి కూడా ఈ బిల్లు వెసులుబాటు కల్పించడం లేదు. జైళ్లలోనూ, బాల నేరస్థులను ఉంచే చోట వీరికి రక్షణ కల్పించే అంశం ఈ బిల్లులో లేదు.

ఇంత కీలకమైన విషయంలో ప్రభుత్వం అరకొరగా వ్యవహరిస్తోంది. తృతీయ లింగానికి (హిజ్రాలను, అరవానీలను) సమాజం చులకనగా చూస్తుంది. ఇటీవలే వీరిని న్యాయపరంగా గుర్తించారు. పోలీసులు, ప్రజారోగ్య శాఖ వారు వీరిని చులకనగా చూడడం వల్ల, వారి విషయంలో కిరాతకంగా వ్యవహరించడంవల్ల వారికి రాజకీయ హక్కులు లేకుండా పోయాయి. సామాజిక-ఆర్థిక రంగంలో వారికి దిక్కులేకుండా పోయింది. ఇలాంటి బిల్లు ప్రభుత్వానికే కాక సమాజానికి కూడా అవమానకరం. అందువల్ల దీనిని ఉపేక్షించవలసిందే. తిరస్కరించవలసిందే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top