బ్యాంకులకు కాయకల్ప చికిత్స?!
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
అక్టోబర్ 24వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధనంగా రూ. 2.11 లక్షల కోట్లు సమకూర్చనున్నట్టు ప్రకటించారు. దీనిలో రూ. 1.35 లక్షల కోట్లు మూలధన పెట్టుబడికి బాండ్ల రూపంలోనూ, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపు ద్వారాను, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ ద్వారానూ సమకూరుస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు (మొండి బాకీలు) పెరిగిపోయినందువల్ల, రుణాలు ఇవ్వడం అసంతృప్తికరంగా ఉన్నందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం సమకూర్చడాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిలో కొంతమంది సమర్థించారు. ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన తర్వాత వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రైవేట్ షేర్ మార్కెట్ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేశాయి.
రెండు పరిణామాల పర్యవసానంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిది ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తులు గందరగోళంగా మారాయి. 2017 మార్చి ఆఖరునాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన కొన్ని రుణాల వసూలు పరిస్థితి సందిగ్ధంగా తయారైందని 2016-17 వార్షిక నివేదికలో రిజర్వూబ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆస్తులన్నీ వసూలు కాకుండా మిగిలిపోయిన నిరర్థక ఆస్తులే. కొన్ని రుణాలు వసూలు కానందువల్ల వాటిని వాయిదా వేశారు. 2016-17లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు వచ్చాయి. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగించినందువల్ల మన దేశంలోనూ అలాంటి పరిస్థితే ఉందనుకున్న నియంత్రణా వ్యవస్థలు నియంత్రించడంలో అమితమైన ఓర్పు ప్రదర్శించాయి. దీనితో 2009 నుంచి నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇవ్వడం తగ్గింది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో నిర్వహణకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కొనసాగుతోందన్న వాదన వినిపించింది. వీటన్నిటి ఫలితంగా నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి.
రెండవది – 2014-15 నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గింది. 2016-17లో రుణాలివ్వడం కేవలం 8.2 శాతం మాత్రమే ఉంది. 2017 సెప్టెంబర్ ఆఖరు నాటికి రుణాలు ఇచ్చే రేటు మరీ దిగజారింది. అన్నింటికన్నా మించి వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడం దిగజారింది. ఇది 2017 సెప్టెంబర్ నాటికి 5.8 శాతానికి పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఈ పెరుగుదల 15.9 శాతం ఉండేది. 2017 సెప్టెంబర్ ఆఖరు నాటికి సేవా రంగానికి రుణాలు ఇవ్వడం 7 శాతానికి పడిపోయింది. ఈ రంగానికి రుణాలు ఇవ్వడం 2016 సెప్టెంబర్ నాటికి 18.4 శాతం ఎదుగుదల చూపించింది. ఆహార పదార్థాలకు కాని రంగాలలో బ్యాంకులు రుణాలు ఇవ్వడం 2016లో 10.8 శాతం ఉంటే 2017 సెప్టెంబర్ నాటికి అది 6.1 శాతానికి పడిపోయింది.
ఈ రెండు పరిణామాలకు మధ్య ఉన్న అంతస్సంబంధం ఏమిటి? ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నది కేవలం బ్యాంకుల నిరర్థక ఆస్తులేనా? ఆర్థిక మంత్రిత్వ శాఖ, స్టాక్ మార్కెట్ వర్గాలు ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుతోందని ఎంత ఊదరగొట్టినా స్థూల జాతీయోత్పత్తి గత ఆరు త్రైమాసికాల కాలంలోనూ దిగజారుడు ధోరణిలోనే ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ మధ్య త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయింది. గత మూడు సంవత్సరాల కాలంలో ఇంత తక్కువ ఆర్థికాభివృద్ధి ఇదే మొదటి సారి. పెద్ద నోట్ల రద్దు, హడావుడిగా వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలు చేయడం ఆర్థికాభివృద్ధి కుంటువడడాన్ని మరింత వేగవంతం చేసింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, ప్రభుత్వం నిర్మాణాత్మక వ్యవస్థకు ఆటంకం కలిగించడం లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాల అవసరం తక్కువగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో బ్యాంకులు పెట్టుబడుల క్రమాన్ని పెంచడానికి పరిశ్రమలను, వ్యాపార సంస్థలను రుణాలు తీసుకొమ్మని బలవంత పెట్టలేవు. అందువల్ల బ్యాంకుల మూలధనానికి నిధులు సమకూర్చడం వల్ల అద్భుతం జరిగిపోతుందని ఎందుకు ఊహించుకోవాలి?
బ్యాంకుల మూల ధనానికి నిధులు సమకూర్చడానికి, రైతుల రుణ మాఫీతో పోల్చి చూసినప్పుడు ఈ వైరుధ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రుణాలు మాఫు చేయడం వల్ల నిజాయితీగా రుణాలు చెల్లించే వారిని నిరుత్సాహ పరచినట్టవుతుందన్న వాదనలు విన్నాం. రుణాలు ఎగ్గొట్టిన వారి పేర్లు బయట పెట్టడానికి ప్రభుత్వం విముఖంగా ఉండడం కూడా మన అనుభవం లోనిదే. అదే విధంగా భారీ ప్రైవేటు రంగ సంస్థలు రుణాలు ఎగవేస్తున్నప్పుడు, రుణాల వసూలు మందకొడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం పంపుతున్న సంకేతం ఏమిటి? భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వారికి ఊతం ఇచ్చినట్టు కాదా? ఇది కుదేలైన సంస్థలకు, నాసి రకంగా పని చేసే బ్యాంకులకు అనవసరమైన భరోసా ఇచ్చినట్టు అవుతుంది కదా! ఇలా చేయడం నష్టాలు మూటగట్టుకునే సంస్థలను ఆదుకోవడం, లాభాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమే. మరో వైపున నిరర్థక ఆస్తులు పెరిగిన బ్యాంకులకే మూలధనం సమకూర్చే బాండ్లు అందజేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.
బ్యాంకుల సంక్షోభానికి పరిష్కారం ఇలా ఉంటుందని ఊహించలేదు. 2016లో ఆమోదించిన దివాలా నియమావళి కొత్త శకానికి నాందీ పలుకుతుందనుకున్నాం. కాని వాస్తవంలో అలా జరగలేదు. ఉక్కు, విద్యుత్తు, టెలీకమ్యూనికేషన్ రంగాలు ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నాయి. 2017-18 బడ్జెట్ లో బ్యాంకింగ్ రంగం పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పారు. అలాంటప్పుడు మూల ధనం సమకూర్చాలని ఇప్పుడు ఎందుకు నిర్ణయించినట్టు?
రెండు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు త్వరలో జరగుతున్న దశలో ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక రంగంలో విఫలం అవుతోందని రుజువు అవుతున్నందువల్ల భ్రమ గొలిపే ఊతం అందిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. దీని వల్ల బుస బుస పొంగుతున్న స్టాక్ మార్కెట్ మరింత పెరుగుతుందా? మోదీ ఆర్థిక విధానం గొప్పతనం ఇదేనా? బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ అంటే ఇదేనా? ఇన్ని ప్రశ్నలు బుర్రలో తొలుస్తున్న సమయంలో మూలధనం సమకూర్చడంవల్ల మరిన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. బ్యాంకులకు ఊతమివ్వడం కాయకల్ప చికిత్సగా దిగజార కూడదు. ఇదే విషాదం.