‘1917-21 మహా విప్లవం’: లెనినిజం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
రష్యాలో 1917 నుంచి 1921 దాకా జరిగిన విప్లవం గురించి 1991 నుంచి చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. కాని ఇప్పటికీ ఈ విప్లవాన్ని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయత్నంగానూ, కుట్రగానూ చిత్రిస్తున్నారు. ఆ తర్వాత ఎర్ర సైన్యం భయోత్పాతం కొనసాగిందంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగే ప్రయత్నం లేదా కుట్ర నిజానికి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి పాలక వర్గాల మధ్య ఘర్షణగానే భావించాలి. ఆ ప్రయత్నంలో ఎంత హింసాకాండ జరుగుతుందన్నది విప్లవప్రతీఘాతుక శక్తులు పాల్పడే హింసాకాండ మీద ఆధారపడి ఉంటుంది. రష్యా విప్లవానికి సంబంధించినంతవరకు ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల ప్రమేయం ఉంది. విప్లవ చరిత్రను చెప్పడంలో విప్లవ ప్రతీఘాతుక శక్తుల హింసాకాండను విస్మరించడానికి వీలు లేదు. ఈ హింసకు మూలాలు సామ్రాజ్యవాదంలో ఉంటాయి.
ష్యాలో 1917లో రెండు విప్లవాలు వచ్చాయి. ఒకటి ఫిబ్రవరిలో, రెండోది అక్టోబర్ లో వచ్చింది. మొదటి విప్లవంలో రాజరికాన్ని, నియంతృత్వాన్ని పడదోశారు. రెండవ విప్లవంలో విప్లవప్రతీఘాతుక శక్తుల నుంచి విప్లవాన్ని పరిరక్షించవలసి వచ్చింది. కాని ఇందులో పెట్టుబడిదారీ విధానంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఉంది. ఆ సంవత్సరం ఏప్రిల్ లో లెనిన్ ప్రవాస జీవితం చాలించి స్వదేశం తిరిగి వచ్చారు. ఆయన “ఏప్రిల్ సిద్ధాంతం” లో సోషలిజాన్ని ఎజెండాలో చేర్చారు. ఏప్రిల్ ఆఖరు నాటికి బోల్షెవిక్ పార్టీ సోవియట్ల ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపు ఇచ్చింది. సోవియట్లు అంటే ఫిబ్రవరి విప్లవం తర్వాత కార్మికులు, సైనికులు కలిసి ఎన్నుకున్న సంఘాలు. అందులో బూర్జువాలకు, భూస్వాములకు చోటు లేదు.
విశాల యూరప్ లో విప్లవం సాధ్యం కావాలంటే రష్యాలో సోషలిస్టు విప్లవం అవసరం అని లెనిన్ భావించారు. దీన్నే ఆయన బలమైన శృంఖలంలో బలహీనమైన లంకెను తెగ్గొట్టడం అన్నారు. ఇదే జరగ కుండా ఉంటే రష్యా విప్లవం సఫలమై ఉండేది కాదు అని లెనిన్ భావించారు. వలసవాదాన్ని ప్రతిఘటిస్తున్న జాతీయ పోరాటాలతో ఐక్యత అవసరం అని కూడా లెనిన్ ఆలోచించారు. మొదటి ప్రపంచ యుద్ధం విపరీతమైన హింసాకాండకు, అలజడికి, రోగాలకు, కరవుకు, తీవ్రమైన ఆర్థిక విపత్తుకు కారణమైంది. సైన్యంలో తిరుగుబాటు రావడంతో బోల్షెవిక్ పార్టీ తక్షణం యుద్ధం నిలిపి వేయాలని, బేషరతుగా శాంతి నెలకొనాలని, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలలోని శ్రామిక వర్గం ఏకం కావాలని పిలుపు ఇచ్చింది. కార్మికులు, సైనికులు కొనసాగిస్తున్న పోరాటంలో నిబద్ధులైన మేధావులకు పాత్ర కల్పించింది.
1917 శరత్కాలం నాటికి వామపక్ష సోషలిస్టు విప్లవకారులకు, బోల్షెవిక్కులకు సోవియట్లలో మెజారిటీ సమకూరింది. ప్రజలలో విప్లవ చైతన్యం పెరిగింది. బోల్షెవిక్ పార్టీ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. వింటర్ పాలెస్ ను స్వాధీనం చేసుకుంది. అధికార పక్షాలు ఇక ఎంత మాత్రం పరిపాలన కొనసాగించలేని దశకు చేరుకున్నాయి. పాలకుల దాష్టీకాలను ప్రజానీకం భరించే స్థితి లేదు. రెండవ అఖిల రష్యా సోవియట్ల మహాసభలో “సర్వాధికారాలు సోవియట్లకే” అన్న వాగ్దానాన్ని నెరవేర్చారు. తీవ్రమైన భూసంస్కరణలు అమలు చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ప్రజలకు భూములు దక్కాయి. భూమి సరుకు కాకుండా పోయింది. దున్నే వారికే భూమి దక్కింది.
రష్యా విప్లవానికి విజయం సునాయాసంగా దక్కలేదు. జనరల్ కోర్నిలోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి విప్లవానికి వ్యతిరేకంగా 1917 ఆగస్టులో విప్లవప్రతీఘాతుక ప్రయత్నాలు జరిగాయి. సైనికాధికారులందరూ కలిసి నిరంకుశత్వానికి పాల్పడడానికి ప్రయత్నించారు. అయితే సైన్యం విచ్ఛిన్నం కావడంతో విప్లవప్రతీఘాతుక శక్తులు బలహీన పడ్డాయి. భారీ సంఖలో సైనికులు విప్లవంలో భాగస్వాములయ్యారు. ఈ అంతర్యుద్ధంలో ఇంతకు ముందు పేర్కొన్న అగ్ర రాజ్యాలు మద్దతు ఇవ్వడంతో విప్లవప్రతీఘాతుక శక్తులు ఎర్ర సేనకు వ్యతిరేక పోరాటంలో కొంత కాలం నిలబడగలిగాయి. యూరప్ లోని కొన్ని ప్రాంతాలలో “సోవియట్ రష్యాలో జోక్యం చేసుకోకండి” అని నినదించడం వల్ల అగ్ర రాజ్యాలు విప్లవ వ్యతిరేకులకు పూర్తి స్థాయిలో అండగా నిలవలేక పోయాయి. తమ దేశాల్లో కూడా సోవియట్లు ఏర్పడతాయేమోనని ఈ దేశాలు భయపడ్డాయి. రష్యాకు పంపించిన తమ సేనలు తిరుగుబాటు చేస్తాయేమోనన్న భయం కూడా ఆ దేశాలను పీడించింది.
ఏ విప్లవంలోనైనా జీవన్మరణ పోరాటం జరిగేటప్పుడు స్పష్టమైన విభజన రేఖ ఏర్పడుతుంది. “మీరు ఎటువేపు” అన్న ప్రశ్న తలెత్తి పునరేకీకరణ జరుగుతుంది. దురదృష్టవశాత్తు “ఉదారవాద” సోషలిస్టులు విప్లవప్రతీఘాతుక శక్తుల శిబిరంలో చేరిపోయారు. 1917 ఆగస్టులో కాడెట్ పార్టీ జనరల్ కోర్నిలోవ్ సేనలకు మద్దతిచ్చినందువల్ల వారు ఏ గుణపాఠం నేర్చుకోలేదు. వామపక్ష సోషలిస్టులు జర్మనీతో కుదిరిన బ్రెస్ట్-లిట్వోస్క్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం వల్ల 1918 మార్చిలో బోల్షెవిక విప్లవానికి పెద్ద విఘాతం కలిగింది. 1918 లో మొదలైన అంతర్యుద్ధం చాలా క్రూరమైంది, రక్తసిక్తమైంది. విపరీతమైన గందరగోళంలో ఉన్న దేశంలో అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది అన్న అనుమానం కలిగింది. రెండు శిబిరాల మధ్య రాజీకి ఆస్కారమే లేకుండా పోయింది. అది జీవన్మరణ పోరాటం. ఆర్థిక, ప్రజాస్వామిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలనుబట్టి చూస్తే విప్లవ ప్రభుత్వం రష్యా ప్రజానీకాన్ని కష్టాల కుంపటిలోకి తోసింది. విపరీతమైన కష్ట నష్టాలకు కారణమైంది అని సోవియట్ సెంచరీ అన్న గ్రంథంలో చరిత్రకారుడు మోషే లెవిన్ అన్నారు.
మరి విప్లవం మాటేమిటి? అందులో కచ్చితంగా పేద రైతుల, సైనికుల (వీరిలో చాలా మంది రైతులే), కార్మికుల పాత్ర ఉంది. సైనిక దుస్తుల్లో ఉన్న, లేని వారందరిలోకి రైతుల సంఖ్యే ఎక్కువ. విప్లవ శక్తుల్లో ప్రధాన పాత్ర రైతులదే. పారిశ్రామిక కార్మికుల్లో కూడా సగం మంది నిజానికి సగం మేరకే కార్మికుల లక్షణం గల వారు. అందువల్ల ఈ విప్లవం ప్రధానంగా సామాన్య ప్రజలదే. కాని ఈ విప్లవానికి నాయకత్వ స్థానంలో ఉన్న మేధావులు దీనిని లెనిన్ ప్రభోధించిన “సోషలిస్టు” విప్లవంగానే పరిగణించారు. 1917 సెప్టెంబర్ లో రాసిన స్టేట్ అండ్ రెవల్యూషన్ అన్న గ్రంథంలో లెనిన్ విప్లవానికి దీర్ఘ కాలిక లక్ష్యాలను నిర్దేశించారు. ఇది దాదాపు అర్థ అరాచక సోషలిస్టు పంథాయే.
లెనినిజాన్ని ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ప్రశంసించిన వారు ఉన్నట్టే గుడ్డిగా వ్యతిరేకించిన వారూ ఉన్నారు. పాల్ లె బ్లాంక్ రాసిన లెనిన్ అండ్ రెవల్యూషనరీ పార్టీ (1989), లెవిన్ రాసిన ది సోవియట్ సెంచరీ మాత్రమే దీనికి మినహాయింపు. అణగారిన వర్గాల వారిలో చైతన్యం పెంచడానికి లెనిన్ కృషి చేశారు. ఆయన చూపిన బాటలోని అనేక అంశాలు నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణమైనవి. అందుకే 1902-1904 మధ్య వాట్ ఈస్ టు బి డన్ గ్రంథం రాసిన నాటి దశకు, 1905-1906, 1908-1912, 1918-1921 నాటి ఆలోచనలకు పార్టీ అంటే ఏమిటో లెనిన్ భావాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 1918-21 దశలో తీవ్రమైన అస్పష్టత, వైరుధ్యాలు కనిపిస్తాయి. ఆ దశలో పీడిత ప్రజలకు పార్టీ ఏం చెప్తే అదే అన్న దొరణి, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి బదులు కేంద్రీకరణ కనిపిస్తాయి. నిజానికి ఈ పరిస్థితిని చక్క దిద్దవలసింది. కాని అలా జరగలేదు. లెనిన్ ఆఖరి పోరాటం, సోవియట్ శతాబ్దం అన్న గ్రంథాలలో లెవిన్ లెనినిజం లోని నిర్దిష్ట అంశాలను, అప్పటి నిర్దిష్ట పరిస్థితులను ప్రస్తావించారు.
ఆ దశలో లెనిన్ ఊహాజనిత అంశాల మీద కాకుండా సోషలిస్టు భావాలను దీర్ఘకాలంలో పరిరక్షించవలసిన అంశం మీద, వాస్తవ లక్ష్యాల సాధన మీద దృష్టి పెట్టారు. రైతుల అవసరాలను పట్టించుకోవడం మీద దృష్టి సారించారు. నియంతృత్వ వ్యవస్థను చక్క దిద్దే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానమైంది స్టాలిన్ ను పార్టీ అగ్ర నాయకత్వం నుంచి తొలగించడం. మారుతున్న చారిత్రక పరిస్థితుల కారణంగ పరిస్థితిని అంచనా వేయడమే కాకుండా లక్ష్య నిర్దేశం కూడా చేయవలసి వచ్చింది. లెనినిజం-బోల్షెవిజం, స్టాలినిజం మధ్య జరిగిన ఘర్షణలో స్టాలినిజం విజయం సాధించడమే విషాదం. స్టాలినిజం హింసకు, నిరంకుశత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రత్యర్థులను అంతమొందించింది. లెనినిజాన్ని అనుసరించే వారు ఈ రుగ్మత నుంచి బయటపడాలి.