ఆదివాసులు చదువుకు దూరమే
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
సంచార జాతులు, అర్ధ సంచార జాతులైన విముక్త జాతులు ఇప్పటికీ ఎంత దుర్బలంగా ఉన్నాయో ఇటీవలి సర్వేలో బహిర్గతమైంది. విద్య అభ్యసించడం, ఉపాధి అవకాశాల విషయంలో ఈ జాతులు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నాయి. ఈ జాతుల వారిని ఇంకా నేరస్థ జాతులుగానే పరిగణిస్తున్నారు. విముక్త జాతుల జాతీయ కమిషన్, సంచార, అర్ధ సంచార జాతుల పై అధ్యయనం చేసిన 2008నాటి రెంకే కమిషన్, 2011లో విముక్త, సంచార తెగల వారిపై జాతీయ సలహా సంఘం, గిరిజనుల సామాజిక ఆర్థిక, ఆరోగ్య, విద్యా స్థాయిపై ఉన్నతాధికార సంఘం (ప్రొఫెసర్ వర్జీనియస్ జాజా కమిటీ, 2014) మొదలైన కమిషన్లు ఈ జాతుల స్థితిగతులను గురించి చెప్పాయి. ఈ జాతుల సామాజిక ఆర్థిక, విద్యా స్థాయి గురించి విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేనందువల్ల భారత సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐ.సి.ఎస్.ఎస్.ఆర్.) వీరి సామాజిక, విద్యా స్థాయిని పరిశీలించడానికి తొమ్మిది రాష్ట్రాలలో ఒక అధ్యయనం నిర్వహించింది.
హైదరాబాద్ లోని సామాజిక అభివృద్ధి మండలి 2012-2015 మధ్య మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రేదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఒక అధ్యయనం చేసింది. ఇందులో 13,000 కుటుంబాల వారి స్థితిగతులను అధ్యయనం చేశారు. రెంకె కమిషన్ 306 సమాజాలను నమోదు చేసింది. హైదరాబాద్ సంస్థ చేసిన అధ్యయనంలో 76 సామాజిక వర్గాల గురించి (66శాతం ఇతర వెనుకబడిన కులాలు, 16శాతం షెడ్యూల్డ్ కులాల, 18శాతం షెడ్యూల్డ్ జాతులు), నేరస్థ జాతులుగా పేరున్న వారి గురించి అధ్యయనం చేసింది. నేరస్థ జాతులుగా పేర్కొన్న వారి కోసం ప్రత్యేక ప్రశ్నపత్రం తయారు చేశారు. మొత్తం మీద ఈ అధ్యయనంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేనప్పుడు, ఈ జాతుల వారి మీద మచ్చ పడ్డప్పుడు వారు చదువుకునే అవకాశాలు తగ్గుతాయని తేలింది.
ఈ అధ్యయనం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో జరిగింది. గత 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితిని అధ్యయనం చేశారు. అంటే వీరు సంచార జీవనం మానేసి స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు. ఈ రాష్ట్రాలలో ఈ జాతుల వారు సాంప్రదాయిక వృత్తులను అనుసరించడం నామ మాత్రమైందే. అయితే సాంప్రాదాయిక వృత్తులను అనుసరిస్తున్న కుటుంబాలు గుజరాత్ లో 25శాతం, మధ్యప్రదేశ్లో 22 శాతం ఉన్నాయి. వీరు జీవనోపాధి కోసం అత్యంత నిమ్న వృత్తులను అంటే వ్యవసేయతర కార్మికులుగా మారడం వంటి పనులు చేస్తున్నారు. బలవంతంగా వలస వెళ్ల వలసి రావడం వల్ల వారి కుటుంబాలు స్థిరంగా ఉండకపోవడం వల్ల విద్య అందుబాటులో ఉండడం లేదు. సంచార జాతుల సంస్కృతి భిన్నమైంది. వారు నిరంతరం సంచరిస్తుంటారు. దీనికి సాంస్కృతిక మూలాలు ఉన్నాయి. అయితే ఇలాంటి జీవనానికి, బలవంతంగా వలస వెళ్లడానికి తేడా ఉంది. బలవంతంగా వలస వెళ్లాల్సి రావడం వల్ల ఈ సమాజాలు అన్ని స్థాయుల్లోనూ అకాలపరిపక్వతకు గురి అవుతాయి. ఈ వలసలు తమిళనాడు, ఛత్తీస్ గఢ్ లో 40శాతం, తెలంగాణాలో 59 శాతం ఉన్నాయి. తెలంగాణాలో ఇలా వలస వెళ్లిన వారిలో 54 శాతం మంది తాము సవత్సరానికి ఒక సారి వలస వెళ్తున్నామని చెప్పారు. వీరిలో 80శాతం మంది నెల నుంచి మూడు నెలలదాకా వలస వెళ్తామని చెప్పారు. ఈ కుటుంబాల వారిలో 31శాతం మంది రోజు కూలీలుగా పని చేస్తున్నారు. తమిళనాడులోని ఈ రకం కుటుంబాల వారిలో 53 శాతం మంది వ్యవసాయేతర కూలీలుగా పని చేస్తున్నామని చెప్పారు.
విముక్త జాతుల వారిలో అసలు ఎప్పుడూ బడికెళ్లని వారు అన్ని రాష్ట్రాలలోనూ ఎక్కువే ఉన్నారు. దాదాపు 25 శాతం మంది ఎప్పుడూ బడికెళ్ల లేదు. మహారాష్ట్రలో ఇలాంటి వారు 5.5శాతం, తమిళనాడులో 18%, ఆంధ్రప్రదేశ్లో 21% ఉన్నారు. బడికెళ్లిన వారిలో చాలా మంది ప్రాథమిక స్థాయి తర్వాత మహా అయితే మాధ్యమిక స్థాయి తర్వాత చదువు మానేస్తున్నారు. బడి మానేయడానికి వలస వెళ్లడమే ప్రధాన కారణం అని వీరు చెప్తున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య నిష్పత్తి సరిగా లేనందువల్ల విద్యార్థులు బడి మానేస్తున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు.
ఆదివాసులు చదువుకోవడానికి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు వసతి గృహాలు అందుబాటులో ఉండడంలో లింగ వివక్ష ఎక్కువగా ఉందని రెంకె కమిషన్ తేల్చింది. అయితే సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలో చదువుకునే బాలలు కనిపించడం లేదు. వసతి గృహాలు ఏర్పాటు చేసినందువల్ల ఆదివాసుల్లో చదువుకోవడం పెరిగినట్టు ఈ అధ్యయనంలో తేలలేదు. తల్లిదండ్రులకు చదువు లేకపోవడం, చైతన్యం లేక పోవడం దీనికి కారణం అయి ఉండొచ్చు. పాఠశాలలు దూరంగా ఉండడం కూడా ప్రధానమైన కారణమే. అయినప్పటికిన్నీ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనుకుంటున్నారు. చదువు కొనసాగించకపోవడానికి పాఠశాలలు వారి ఇళ్లకు దూరంగా ఉండడం వల్ల బడి మానేస్తున్న వారున్నారు. అందువల్ల ఆదివాసుల జనావాసాలకు దగ్గరలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి. దాని వల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుల గురించి ఆలోచించడానికి వీలుంటుంది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, తమిళనాదు, ఆంధ్రప్రదేశ్ రాష్త్రాలలోని వారు 88శాతం నుంచి 90శాతం దాకా బడికెళ్లారు. తెలంగాణ, గోవా రాష్ట్రాలలోని 75 శాతం మంది బడికెళ్లారు. ప్రైవేటు పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికి అణగారిన వర్గాల వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకే హాజరవుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. అందువల్ల మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యం, పాఠ్య ప్రణాళిక సంస్కరణ అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థాగత ఏర్పాట్లు అతి తక్కువగా ఉన్నాయని, నాణ్యత నాసి రకంగా ఉందని, కొన్ని వర్గాల పిల్లలను పాఠశాలలలో చేర్చుకోని పరిస్థితి ఉందని ఈ సర్వేలో తేలింది. స్థానిక పరిస్థితులు కూడా ఈ వర్గాల ప్రజలకు తోడ్పడడం లేదని కూడా రుజువైంది. వెనుకబడి ఉన్న ఈ వర్గాల వారి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అమలులో ఉన్న ఏర్పాట్లు చాలవని కూడా తేలింది.