హద్దు మీరిన మోదీ అసత్య ప్రచారం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ప్రజాభిప్రాయాన్ని మలచడంలో వాస్తవాల కన్నా భావోద్వేగాలు, వ్యక్తిగత నమ్మకాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, వాస్తవాలను తారుమారుచేస్తున్న ఈ రోజుల్లో తన 67వ పుట్టిన రోజున సర్దార్ సరోవర్ ఆనకట్టను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలను చూసి ఆశ్చర్య పోనక్కరలేదు. మూడు దశాబ్దాలుగా కొన సాగుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ క్రమంలో సంక్లిష్టమైన, వివాదాస్పదమైన చరిత్రను మోదీ విస్మరించారు. "ప్రపంచ బ్యాంకు సహాయం ఉన్నా లేకపోయినా ఈ పథకాన్ని కొనసాగించాలని నేను నిర్ణయించాను" అని ఆయన అన్నారు. కాని వాస్తవాలు దీనికి విరుద్ధమైనవి. ఆర్థిక సహాయం చేయడానికి మొదట అంగీకరించి తర్వాత ప్రపంచ బ్యాంకు వెనక్కు తగ్గిన తర్వాత "గుజరాత్ దేవాలయాలు" విరాళలిచ్చి తోడ్పడ్డాయి అని ప్రధాని చెప్పారు. ఇక్కడా మోదీ సత్యదూరంగానే మాట్లాడారు.
నర్మదా నది మీద నిర్మిస్తున్న 30 భారీ పథకాలలో సర్దార్ సరోవర్ ఆనకట్ట ఒకటి. వీటితో పాటు మరో 135 మధ్య తరహా పథకాలు, 3,000 చిన్న తరహా పథకాలు కూడా నిర్మిస్తున్నారు. సర్దార్ సరోవర్ పథకానికి దేవాలయాలు ఆర్థిక సహాయం అందించలేదు. ఈ పథకానికి 300 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు 1993లో తుడి విడత రుణం విడుదల చేయాల్సిన దశలో వెనక్కు తగ్గింది. అప్పుడు ప్రభుత్వ వ్యయంతో ఈ పథకం పూర్తి చేశారు. ఈ పథకం వెనక ప్రజల నిరసనోద్యమాల చరిత్ర ఉంది. ఈ చరిత్రను మనం గమనించాలి. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇదంతా "తప్పుడు సమాచారం" అని మోదీ కొట్టి పారేశారు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బాధ్యతాయుత ప్రకటన చేయడం లేదు. నిలకడగా కొనసాగే అభివృద్ధి, సమానమైన అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు.
ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి కారణం ఉంది. ఆ సంస్థ ఈ పథకాన్ని సమీక్షించడానికి ఓ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు అమలు కావడం లేదని ఈ సమీక్షలో తేలింది. అందువల్ల వెనక్కు తగ్గడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఈ సమీక్షలో నర్మదా బచావో ఆందోళన్ కొనసాగిస్తున్న వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక భారీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తమైనాయి. పునరాలోచన మొదలైంది. అందుకే 1998లో ఆనకట్టలపై అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాతే భారీ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు రుణాలివ్వడం తగ్గి పోయింది. జనం నిర్వాసితులు కావడం, పర్యావరణానికి ముప్పు మొదలైన అంశాల గురించి ఆలోచించడం ప్రారంభమైంది.
సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి 1961లో జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. కాని అప్పుడే ఆయన “బృహత్” ప్రాజెక్టుల గురించి అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజుల్లో పథకం పెద్దదైన కొద్దీ భారీ పెట్టుబడి అవసరమైనా ఫలితాలు కూడా భారీగానే ఉంటాయనుకునే వారు. కాని సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణం 1987 లో ప్రారంభం అయ్యే నాటికి భారీ పథకాలపై పునరాలోచన మొదలైంది. మొట్ట మొదటి సారి సామాజిక, పర్యావరణ అంశాల గురించి ప్రశ్నించడం, సవాలు చేయడం మొదలైంది. 138.68 మీటర్ల ఎత్తు గల ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యే సరికి మూడు దశాబ్దాల కాలం పట్టింది. ఈ సవాళ్లూ, ప్రశ్నలు సబబైనవేనన్న అభిప్రాయం మరింత బలపడింది. వ్యయం-ఫలితం అన్న అంశాలు కేవలం గణాంకాలకు పరిమితం కాకుండా పోయాయి. ఇప్పుడు ప్రజలు చెల్లించవలసిన మూల్యం, పర్యావరణానికి కలిగే నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఆనకట్ట నిర్మాణం తనవల్లే పూర్తి అయిందని మోదీ జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ఆయన గుజరాత్ ప్రజల ఆత్మ గౌరవ అంశంగా మార్చిన మాట నిజమే. దీన్ని అభ్యంతర పెట్టిన వారినందరి మీద గుజరాత్ వ్యతిరేకి అన్న ముద్ర వేశారు. వాస్తవం ఏమిటంటే కేంద్రంలో ఉన్న అనేక ప్రభుత్వాలు "ఎంత పెద్దదైతే అంత మంచిది" అనుకున్నందువల్లే ఈ పథకం పూర్తి అయింది. నర్మదా బాచావో ఆందోళన్ దశాబ్దాల తరబడి ఉద్యమం నడిపినా, సహాయ పునరావాస కార్యకలాపాలకు సంబంధించి సుప్రీం కోర్టులో అనేక కేసులు నడిచినా 2014 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే నర్మదా నియంత్రణా వ్యవస్థ ఈ పథకానికి పచ్చ జెండా ఊపింది. అంతవరకు ఈ ఆనకట్ట ఎత్తు 121.92 మీటర్లు మాత్రమే ఉండేది. తక్కువ ఎత్తు ఉన్నప్పుడు కూడా నిర్వాసితులయ్యే వేలాది కుటుంబాలు సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఆనకట్ట ఎత్తు పెంచడం తొందరపాటు, అవివేకం, వినాశకరం అని ఆ రంగంలో పండితులు, నీటికి సంబంధించిన నిపుణులు, ఆందోళన కారులు బహిరంగ లేఖ రాసి అభ్యంతరపెట్టినా నర్మదా నియంత్రణ వ్యవస్థ ఆనకట్ట ఎత్తు పెంచడానికి ఎందుకు అనుమతించిందో తెలియదు. మోదీ స్వయంగా దానికి దోహదం చేశాను అని చెప్తే తప్ప నిజం తెలియదు.
సర్దార్ సరోవర్ పథకం మీద, నర్మదా నది మీద నిర్మిస్తున్న అనేక పథకాలపై బోలెడు సమాచారం, విమర్శలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం పరిధిలోకి వచ్చే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలు సవ్యంగా లేవన్న విమర్శలు తలెత్తాయి. ఈ పథకం వల్ల మధ్యప్రదేశ్ లో ఎక్కువ మంది నిర్వాసితులయ్యారు. నికరంగా ఎంతమంది నిర్వాసితులయ్యారు అనే విషయం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. నర్మదా జల వివాదాల ట్రిబ్యునల్ "ఎంత భూమి తీసుకుంటే నిర్వాసితులకు అంత భూమి ఇవ్వాలి" అని ఆదేశించినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నగదు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. దీని ఫలితంగా ఇప్పటికీ అనేక కుటుంబాల వారు తమ భూములు మునిగిపోక ముందు తమకు భూమి కేటాయించాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ పథకం వల్ల ప్రయోజనాలను కొండంతలు చేసి చెప్తున్నారు కాని మౌలిక సదుపాయాలు, సాగు నీటి కాలవలు ఇంకా నిర్మించాల్సే ఉంది. వీటి వల్ల మళ్లీ నిర్వాసితులయ్యే వారు చెల్లించే మూల్యం ఏమిటో ఇంకా తేలాల్సే ఉంది. మోదీ చెప్పినట్టు "ఈ ఇంజనీరింగ్ అద్భుతం" సాధించడానికి భూములు కోల్పోయిన, జీవనోపాధి కోల్పోయిన వారికీ అందవలసిన ప్రయోజనాలు అందనందువల్ల భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఇంత జరిగినా "త్యాగం" చేసిన ఆదివాసులకు మోదీ ధన్యవాదాలు తెలియజేయడం చూస్తే ఇది ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడమే అనుకోవాలి.