చట్టాల్లో లొసుగులే బాలల భద్రతకు ముప్పు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
గత సెప్టెంబర్ 8వ తేదీన గుర్గావ్ లోని ప్రసిద్ధమైన రయన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏడేళ్ల బాలుడిని మరుగుదొడ్డిలో హత్య చేశారు. ఆ తర్వాత పాఠశాల బస్ కండక్టరును అరెస్టు చేశారు. ఆ బాలుడు మైథునాన్ని అంగీకరించనందువల్ల కండక్టర్ చంపేశాడన్న ఆరోపణ ఉంది. పాఠశాల ఆవరణలో భద్రతా ఏర్పాట్లు సవ్యంగా లేవని దర్యాప్తులో తేలింది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని, రాజ్యాంగ బద్ధమైన బాలల హక్కులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోందని దీన్ని బట్టి అర్థం అవుతోంది.
పట్టణ ప్రాంతాలలోని పాఠశాలల్లో బాలల మీద జరుగుతున్న అఘాయిత్యాలలో గుర్గావ్ ఉదంతం ఆ వరసలో అఒకటి మాత్రమే. ఇలాంటి సందర్భాలలో బాలురు, బాలికలు కూడా అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఈ సమస్యను బాల బాలికల దృష్టితో కాకుండా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే దృష్టితో చూడాలి. బాలలను లైంగిక వేధింపుల నుంచి కాపాడే చట్టం ప్రకారం చూస్తే ఈ అఘాయిత్యాలు 2014లో 8,904 నుంచి 2015లో 14, 913 కు పెరిగాయి. బాలల మీద అఘాయిత్యాలపై 2007లో చేసిన ఒక అధ్యయనంలో ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు అఘాయిత్యానికి గురవుతూనే ఉన్నారని తేలింది. 53.2 శాతం బాలలు తమ మీద ఏదో ఒక రకమైన లైంగిక అఘాయిత్యం జరిగిందని చెప్పారు. 12000 మంది బాలల విషయంలో సర్వే చేస్తే అందులో సగం మంది పాఠశాలలో తమ మీద అఘాయిత్యం జరిగిందని చెప్పారు. ఈ అధ్యయనం 13 రాష్ట్రాలలో అఘాయిత్యానికి గురైన 69శాతం మందిలో 54.68 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు. చాలా మంది పిల్లలు తమపై అఘాయిత్యం జరిగిందని ఎవరికీ చెప్పలేదు. 2015లో ఐక్య రాజ్య సమితి బాలల నిధి విభాగం కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేసే సమగ్ర బాలల పరిరక్షణ పథకం బాలల ప్రాణానికి, వారి వ్యక్తిత్వానికి, బాల్యానికి ఉన్న ముప్పునుంచి కాపాడడానికి ఉద్దేశించింది. బాలల సం రక్షణ కుటుంబాల బాధ్యత అని, దీనికి సమాజం, ప్రభుత్వం, పౌర సమాజం తోడ్పడాలని అనుకుంటాం. ఈ విషయంలో పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. బాలలు రోజులో సగం సమయం పాఠశాలలోనే గడుపుతారు. కాని బాలల భద్రతకు పాఠశాలలు బాధ్యత వహించడం లేదు.
బాలల పరిరక్షణకు సంబంధించిన చట్టాలలో అస్పష్టత ఉండడం కీలక సమస్య. బాలల ఉచిత, నిర్బంధ విద్య చట్టంలో నాణ్యమైన పాఠ్యాంశాలు, మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావన ఉంది కాని బాలల చదువును దెబ్బ తీసే లైంగిక అఘాయిత్యాల నివారణ ప్రస్తావన లేదు. లైంగిక వేధింపుల నుంచి కాపాడే చట్టంలో నేరుగా పాఠశాలలను, వాటి యాజమాన్యాలను ప్రస్తావించకుండా బాలల భౌతిక, భావోద్వేగ సంబంధ, తెలివితేటల, సమాజంలో అభివృద్ధి గురించి మాత్రమే ప్రస్తావించారు. బాలల న్యాయ (సంరక్షణ) చట్టం పరిధిలో అనాధ బాలలు, తప్పి పోయిన బాలలు, తల్లిదండ్రులు వదిలేసిన బాలల విషయం వారిని వేధించడం, సంరక్షణ అవసరమైన బాలల గురించి ఉన్నా అది తీవ్రమైన హింస, అవకాశాలు లేకపోవడం గురించి ప్రస్తావించి వారికి పునరావాసం గురించి మాట్లాడుతుంది. వారిని శరణాలయాల్లో చేర్పించడం గురించి ప్రస్తావిస్తుంది. కాని ఈ చట్టం పాఠశాలలు బాలల సంరక్షణా బాధ్యత స్వీకరించాలని చెప్పదు.
రయాన్ ఇంటర్నేషనల్ పాఠశాలల వంటి ప్రసిద్ధ సంస్థలలో ఇలాంటి సంఘటనలు జరిగినందువల్ల బాలల హక్కుల గురించి విస్తృతంగా చర్చ జరగవలసిన అవసరం ఉంది. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే బాలల లైంగిక వేధింపులు, నివారణకు సంబంధించి పాఠశాలలకు తెలియజెప్పాల్సిన అగత్యం ఉంది. బాలల లైంగిక వేధింపుల గురించి అవగాహన కల్పించడం కోసం నోబెల్ బహుమతి గ్రహీత ఇటీవల దేశ వ్యాప్తంగా భారత్ యాత్ర చేపట్టారు. ఇక హర్యానాలోని పాఠశాలలు తమ ఉపాధ్యాయులను నియమించేటప్పుడు అభ్యర్థుల పూర్వాపరాల గురించి పోలీసులతో దర్యాప్తు చేయించవలసి ఉంటుంది. బాలల భద్రతకు సంఘాలు ఏర్పాటు, పాఠశాల ఆవరణ అంతా సి.సి. కెమెరాలు అమర్చడం, విద్యార్థులు బడికి వచ్చి వెళ్లడానికి సురక్షితమైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మొదటగా తీసుకోవాల్సిన చర్యలే గాని ఇవి మాత్రమే సరిపోవు. పర్యవేక్షణకు మెరుగైన సాంకేతికతను వినియోగించడంతో పాటు బాలల భద్రతకు పాఠశాలలు పూచీ పడేట్టుగా చట్టపరమైన కట్టుబాట్లు చేయాలి.
మొత్తం మీద బాలల భద్రతను కాపాడడానికి మౌలిక సదుపాయాలు, చదువు ఉంటే సరిపోదు. బాలల భద్రతను ప్రభుత్వం పర్యవేక్షించాలి. ప్రస్తుతం పాఠశాలల్లో (ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో) చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది కనక, వ్యాపారం కోసం విద్యాసంస్థలను నడుపుతున్నందువల్ల బాలల విషయంలో పాఠశాలల, ఉపాధ్యాయుల బాధ్యతలు ఏమిటో స్పష్టంగా నిర్దేశించాలి. గ్రామాల్లో ఉండే బాలలకైనా, నగరాల్లోని బాలలకైన ఈ ఏర్పాట్లు ఉండాలి. వారు సురక్షితంగా, హింసకు దూరంగా ఉండే ఏర్పాటు తప్పని సరి. బడిలోనూ, ఇంట్లోనూ, బడికి వేచ్చి పోయేటప్పుడు వారికి పూర్తి భద్రత ఉండాలి.