ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బీజేపీ ఆయువుపట్టుకు ముప్పు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

రాజస్థాన్ రైతులు ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వం నుంచి రూ. 20,000 కోట్ల రుణ మాఫీ సాధించుకున్నారు. ఇలా రైతులు ఉద్యమించి రుణ మాఫీ సాధించుకున్న రాష్ట్రాలలో రాజస్థాన్ నాల్గవది. ఇలాంటి ఉద్యమాలే ఇతర రాష్ట్రాలలో కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ రాష్టాలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత వల్ల బీజేపీ చేపట్టిన సంస్కరణలను తిరగదోడడానికి ఇది సంకేతమా?

రాజస్థాన్ లోని షెఖావతి ప్రాంతంలోని, ముఖ్యంగా సికర్, ఝున్ ఝునూ, చురు జిల్లాల రైతులు సెప్టెంబర్ ఒకటవ తేదీన సికర్ లో నిరవధిక బైఠాయింపు సమ్మె ప్రారంభించారు. 2017 జూన్ నుంచి రైతుల ఆందోళనలు జరిగాయి కాని అవి అన్నీ విఫలమైనాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత తగ్గిన ధాన్యం సేకరణ ధర నుంచి మొదలుకుని రైతులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రైతులు ఉద్యమాలు చేశారు. సహజంగానే జిల్లా పరిపాలనా విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోలేదు. పైగా ఈ ఆందోళనలను విచ్ఛిన్నం చేయడానికి, రైతుల ఐక్యతను భగ్నం చేయడానికి ఎప్పటిలాగే ప్రయత్నించారు. కాని సి.పి.ఐ.(ఎం) కు అనుబంధంగా ఉన్న అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలోని రాజస్థాన్ రైతు ఉద్యమం అంతకంతకు బలపడుతూ వచ్చింది. సాధారణ పౌరులు, వ్యాపారస్థులు, వాణిజ్య రంగంలోని వారు, స్థానికంగా సేవలందించే వారి సంఘాలు రైతుల ఉద్యమంలో పాల్గొన్నాయి. మహిళలు కూడా ఈ ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నారు. కర్ఫ్యూలను సైతం ఉల్లంఘించి నగరాల్లో పట్టణాల్లో, గ్రామాలలో ఉద్యమం కొనసాగింది. ఈ ఏడాది ఇతర చోట్ల జరిగిన రైతుల ఆందోళనకు భిన్నంగా రాజస్థాన్ రైతు ఉద్యమంలో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల వారిని భారీ ఎత్తున సమీకరించారు. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల కన్నా రాజస్థాన్ రైతుల ఉద్యమం భిన్నమైంది.

బీజేపీ చేపడ్తున్న సంస్కరణల్లో గ్రామీణ భారతం అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. బీజేపీ రాజకీయ కార్యకలాపాలు పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువ. చిన్న పెద్ద పట్టణాలలో దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న ప్రధానమైన బలం బ్రాహ్మణులు, వైశ్యులే. 2014 దాకా బీజేపీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేక పోయింది. నరేంద్ర మోదీ గాలి బలంగా వీచడం వల్లే బీజేపీకి గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు సమకూరాయి. కాని ఈ మద్దతు తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. సంస్కరణలు అమలు చేసేటప్పుడు గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోక పోవడం దీనికి కారణం కావచ్చు.

ఆర్థిక సరళీకరణ విధానాలు అనుసరించడం ప్రారంభమై 27 ఏళ్లు గడిచినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులు శ్రామిక శక్తి పరివర్తనకు తోడ్పడలేదు. శ్రామికుల్లో 60 శాతం మంది వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. కాని స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా 15 శాతం మాత్రమే. వ్యవసాయేతర రంగంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కొరవడడం, ప్రభుత్వ సామాజిక భద్రతా చర్యలు తగ్గిపోవడంతో శ్రామికుల్లో ఎక్కువ మంది వ్యవసాయ రంగం, దానికి అనుబంధ రంగాలలోనే ఉండిపోతున్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్షయం చేయడం అంటే మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉపేక్షించడమే.

బీజేపీ ప్రభుత్వం ఇటీవల మూడు ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకుంది. అవి - గో వధ నిషేధం, పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.). ఈ మూడు విధానాలూ రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా ముఖ్యమైన నగదు చేతిలో ఆడనందువల్ల వ్యవసాయ మర్కెట్లకు, రైతులకు విఘాతం కల్గింది. ఈ ఏడాది పంటలు బాగా పండినా వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గాయి. దీనితో రైతుల ఆదాయం తగ్గింది. మరో పంట విత్తడానికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఈ కారణంగానే రైతులు రుణాలు మాఫు చేయాలని కోరుతున్నారు. రుణాలు మాఫు చేయడం వల్ల రైతులకు కలిగే మేలల్లా మళ్లీ రుణాలు తీసుకోవడానికి అవకాశం రావడమే. రెండవది కష్ట కాలంలో రైతులు పశువులు అమ్ముకో గలిగితే తాత్కాలికంగా ఊరట కలుగుతుంది. గో వధ మీద నిషేధం, గో మాంస విక్రయాల మీద నిషేధం - దీనికి తోడు గో సంరక్షకులు విచ్చల విడిగా వ్యవహరించి మూకలుగా హత్యలకు పాల్పడుతుండడం వల్ల పశువుల మార్కెట్ కుప్ప కూలి పోయింది. రైతు పశువులను పోషించే శక్తి లేనందువల్ల వదిలేసిన ఆ పశువులు ఇష్టా రీతిన తిరుగుతూ పంటలు నాశనం చేయడం మొదలైంది. రాజస్థాన్ రైతుల కొర్కెల్లో ఊరి మీద పడి తిరిగే పశువులను అదుపు చేయడమూ ఒక అంశమే. జి.ఎస్.టి. వల్ల చిన్న వ్యాపారులు, వివిధ సేవలు అందించే వారు దెబ్బ తిన్నారు. అందువల్ల ఈ వర్గాలన్ని రైతు ఉద్యమానికి అండగా నిలిచాయి. ప్రభుత్వ విధానాలన్నీ రైతు పెట్టుబడి పెంచేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ మూడు విధానాలను సమర్థించిన వారు ఎక్కువ మందే ఉండొచ్చు కాని వాస్తవంలో ఇవి తిరగబడ్డాయి.

పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో రైతు రుణాలు మాఫు చేయడానికి కారణం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడమే. వ్యవసాయ రంగంలో ఆందోళనలకు ప్రజలను సమీకరించిన ఏకైక ప్రతిపక్ష పార్టీ సి.పి.ఐ.(ఎం). రైతుల ఆందోళనలో, డిమాండ్లను రూపొందించడంలో, మహారాష్ట్ర, రాజస్థాన్ లో రైతుల తరఫున సంప్రదింపులు జరపడంలో అ పార్టీకి అనుబంధమైన అఖిల భారత కిసాన్ సభ ముందుంది. హర్యానాలో ఇదే రకమైన ఆందోళనకు ఈ రైతు సంఘం సిద్ధం అవుతోంది. అవ్యవస్థీకృత రంగం పెరిగిపోయి, ఆ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతున్న దశలో సాంప్రదాయిక కార్మిక సంఘాలు శ్రామికుల కోర్కెల సాధనకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పరిస్థితిని రాజకీయ ఫలితాలు ఉండేట్టు మలచడమే వామపక్షాలకు ఉన్న పెద్ద సవాలు. అప్పుడే ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములను ఆపడం సాధ్యం అవుతుంది. మరో వేపున బీజేపీ "నూతన భారత్" అన్న తన దృక్పథంలో గ్రామీణ ప్రాంతాలను కూడా చేర్చవలసిన అవసరం ఉంది. 

Updated On : 15th Nov, 2017
Back to Top