గౌరి హత్య ఓ మేలుకొలుపు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
సెప్టెంబర్ అయిదవ తేదీన తన ఇంట్లోకి అడుగు పెట్టిన శక్తిశాలి అయిన పత్రికా రచయిత గౌరీ లంకేశ్ ను పొట్టనబెట్టుకున్న హంతకుల బుల్లెట్లు ఆమెను మాత్రమే హతమార్చలేదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడం, ఆధిపత్యం చెలాయిస్తున్న భావాలపట్ల అసమ్మతి వ్యక్తం చేయడం, సామాజిక రుగ్మతలపై పరిశోధన కొనసాగించడం, మానవ హక్కుల ఉల్లంఘనను, అవినీతిని ఎండగట్టడం స్వేచ్ఛాయుత దేశాలలో పత్రికా రచయితల కర్తవ్యం. ఈ పనులు చేసే పత్రికా రచయితలకు గౌరీ లంకేశ్ కు పట్టిన గతే పడుతుందని ఆమె హంతకులు గట్టిగా హెచ్చరించారు.
తన దృష్టిలో దళితుల, మైనారిటీల హక్కులకు భంగం కలిగించే వారిని బహిరంగంగా విమర్శించడం లంకేశ్ స్వభావం. లంకేశ్ తండ్రి పి. లంకేశ్ కన్నడ పత్రిక లంకేశ్ పత్రికే ద్వారా టాబ్లాయిడ్ పత్రికలకు ఒరవడి దిద్దారు. ఆ పత్రిక ద్వారా బలమైన, సవిమర్శనాత్మకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు. తండ్రి మరణించిన తర్వాత గౌరీ లంకేశ్ సొంతంగా గౌరీ లంకేశ్ పత్రికే ప్రారంభించారు. శక్తిమంతులనుకునే వారిని ఆమె నిర్మొహమాటంగా ఆ పత్రికలో విమర్శించే వారు. ఆమె నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని వాడిగా దుయ్యబట్టే వారు. అదే సమయంలో కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టే వారు కాదు. ఈ కారణంగా బలమైన ప్రాంతీయ శక్తులతో వైరం తెచ్చుకున్నారు. అయినా ఆమె అధికార పార్టీని, ప్రభుత్వాన్ని తప్పు పట్టే వారిని సమర్థించే వారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కన్నడ రచయిత, చరిత్రకారుడు ఎం.ఎం. కల్బుర్గికి వచ్చినట్టుగా చంపేస్తామన్న బెదిరింపులు గౌరికి రాలేదు. బెదిరింపుల తర్వాత కల్బుర్గిని 2015లో ఇలాగే ఆయన ఇంట్లోనే హతమార్చారు. హిందూ మిలిటెంట్ల నుంచి కల్బుర్గి 1989 నుంచే బెదిరింపులు ఎదుర్కుంటూ వచ్చారు.
గౌరీ లంకేశ్ హత్య పత్రికా రచయితలను, సామాజిక కార్యకర్తలను. అసమ్మతి వ్యక్తం చేసే వారిని భయకంపితులను చేసింది. గౌరి హత్యపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆమె కన్నడ పత్రికను ప్రారంభించడానికి ముందు ఇంగ్లీషు పత్రికలలో పని చేశారు. ఆమె నివసించింది ఏదో మారు మూల ప్రాంతంలోనో, చిన్న పట్టణంలోనూ కాదు. ఆమె మెట్రో నగరంలో ప్రసిద్ధ వాడలో ఉండే వారు. ఆమె పత్రిక నడుపుతూనే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రర్యటించే వారు. ఆమె మీద అనేక పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. అందులో రెండు సందర్భాలలో గత సంవత్సరం ఆమెకు శిక్ష కూడా పడింది. ధార్వాడ్ నుంచి ఎన్నికైన పార్లమెంటులో బీజేపి సభ్యుడు ప్రహ్లాద్ జోషి, మరో బీజేపి నాయకుడు ఉమేశ్ దూషి గౌరి మీద పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. ఆమెకు విధించిన శిక్షను సెషన్స్ కోర్టులో సవాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుండే వారు. కానీ దుండగుల బారి నుంచి ఆమె తప్పించుకోలేక పోయారు. తమను విమర్శించే వారిని ఇతర పద్ధతుల్లో నిలవరించడానికి పరిమితం కాకుండా అంతమొందించగలమని ఆమెను హతమార్చిన వారు రుజువు చేశారు.
గౌరీ లంకేశ్ ను కడతేర్చిన వారు దేశంలోని మీడియాకు హెచ్చరిక చేస్తున్నారా? హంతకులు ఎవరో తేలేదాకా తొందరపడి నిర్ధారణకు రావడం సముచితం కాదు. ఏమైనప్పటికీ భారత మీడియాలో గౌరి లాగా సాహసోపేతమైన, ఇబ్బంది కలిగించి ఇతరులను ఇరకాటంలో పడేసే వాళ్లు ఎక్కువ మంది లేరు. మన మీడియా చాలావరకు ఎటుబడితే అటు లొంగే స్వభావం ఉన్నదే. ప్రశ్నలు లేవనెత్తదు. కొందరు మాత్రం దీనికి మినహాయింపు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు శక్తిమంతంగా ఉన్నందువల్ల యాజమాన్యాలు అంగీకరిస్తే తప్ప వ్యక్తిగతంగా పత్రికా రచయితలు బలసంపన్నుల బండారాన్ని పరిశోధించి బయట పెట్టడం సాధ్యం కాదు. కార్పొరేట్ సంస్థలకు, రాజకీయ అధికారానికి విభజన రేఖ దాదాపు లేదు కనక అలాంటి పత్రికా రచయితలు ఉండడమూ అసాధ్యమే. అందువల్లే ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు, అంతర్గత ఘర్షణల దాకా అధికారంలో ఉన్న వారు చెప్పేదే వేదవాక్కు అయిపోతోంది. భిన్న స్వరం వినిపించే పత్రికలు అరుదు. అందుకే గౌరీ లంకేశ్ పత్రికే లాంటివి విశిష్టంగా కనిపిస్తాయి. అవి చిన్నవి, స్వతంత్రమైనవే అయినా తోసిపుచ్చగలిగేవి కావు. శక్తిమంతమైన వారు మీడియాకు లంచాలు ఇవ్వజూపినప్పుడు, దుడ్డుకర్రతో బాదాలని చూసినప్పుడు ఇవి ఎంత చిన్న పత్రికలైనా తమ గళాన్ని చాలా బిగ్గరగానే వినిపిస్తాయి. ఈ పత్రికలకు మరే దన్ను లేనందువల్ల అవి రాజ్యానికున్న అపారమైన శక్తికే కాక, రాజ్యంతో సంబంధం లేని శక్తులకు కూడా బలవుతాయి.
లంకేశ్ ను తుపాకీతో కాల్చి చంపేసి ఉండవచ్చు. కాని చాలా సందర్భాలలో పరువు నష్టం కేసులు దాఖలు చేసి వేధించడం సర్వ సాధారణమైన వ్యూహం. పరువు నష్టం కేసులు వచ్చినా లంకేశ్ చెదరలేదు, బెదరలేదు. కాని వ్యాపార వర్గాల వారు, రాజకీయ వాదులు పత్రికల వారిపై పరువు నష్టం కేసులు అనే ఆయుధాన్నే వాడుకుంటారు. అందువల్ల కాల దోషం పట్టిన, వేధింపులకు గురి చేసే పరువు నష్టం చట్టంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి, యూనియన్ ఆఫ్ ఇండియాకు మధ్య కేసులో సుప్రీం కోర్టు 2016 లో ఈ చట్టాన్ని సవాలు చేయడాన్ని తోసిపుచ్చింది. ఈ తీర్పును విమర్శిస్తూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వైర్ లో ఇలా రాశారు: "ప్రపంచం నిరుత్సాహకరంగా లేదు కాని అసమానంగా ఉంది. బలవంతులైన వారు కోర్టు కేసులు వేసి జనం నోళ్లు మూయిస్తున్నారు. భయకంపితులను చేస్తున్నారు. కోర్టుకు లాగడంలో ఉన్న ప్రధాన లక్ష్యం ఇదే. న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణా అయ్యర్ అనేక తీర్పుల్లో ఈ విషయాన్నే నొక్కి చెప్పారు." విమర్శకుల నోళ్లు నొక్కడానికి ఉపయోగపడే ఇలాంటి చట్టానికి ప్రజాస్వామ్యంలో తావు ఉండకూడదు. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరువునష్టం బిల్లు పెట్టాలనుకున్నప్పుడు మీడియా కలిసికట్టుగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం మానుకోవాల్సి వచ్చింది. లంకేశ్ హత్య తర్వాత మీడియా మళ్లీ సమైక్యంగా పోరాడి నేరపూరిత పరువునష్టం చట్టాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉంది. గౌరి కిరాతక హత్య పత్రికా రచయితలకు ఓ మేలుకొలుపు కావాలి. పత్రికా రచయితల ప్రాణాలకు మాత్రమే ముప్పు లేదు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా పత్రికా రచన కొనసాగించడానికే ముప్పు పొంచి ఉంది. అలాంటి పత్రికా రచనే అంతమయ్యే ప్రమాదం ఉంది.