ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

చిన్న ముందడుగు

.

మూడు సార్లు తలాక్ అని విడాకులు ఇచ్చే మందుపాతర లాంటి వివాదంలో సుప్రీం కోర్టు విజయవంతంగా ఓ అడుగు ముందుకేసింది. భారత్ లోని ముస్లిం మహిళలు ఓ చిరు విజయం సాధించారు. దీనికి వారు తమను తామే అభినందించుకోవాలి. లేదా న్యాయవ్యవస్థను మాత్రమే అభినందించాలి. ఈ తీర్పు వెలువడడం తమ ఘనతే అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ని అభినందించాల్సిన అగత్యం ఎంత మాత్రం లేదు. కొంతమంది ముస్లిం మహిళల కృషి వల్లే ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ముస్లిం మహిళల మొర ఆలకించి సుప్రీం కోర్టు ఒకే సారి మూడు సార్లు తలాక్ అని విడాకులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఒకే దఫా మూడు సార్లు తలాక్ ఇచ్చే పద్ధతిని, బహు భార్యాత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ అయిదుగురు ముస్లిం మహిళలు, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ పెట్టుకున్న అర్జీని విచారించిన సుప్రీం కోర్టు ఈ పద్ధతి చెల్లదని తేల్చింది. అయితే సుప్రీం కోర్టు ముమ్మారు తలాక్ విధానాన్ని మాత్రమే విచారించింది. అయిదుగురు న్యాయమూర్తులు కలిసి 395 పేజీలున్న తీర్పు చెప్పారు. కాని ఈ తీర్పు సూటిగా లేదు. అయిదుగురు జడ్జీలు కలిసి మొత్తం మీద విడివిడిగా మూడు తీర్పులు వెలువరించారు. న్యాయమూర్తులు ఆర్.ఎఫ్. నారిమన్, యు.యు. లలిత్ తో పాటు న్యాయమూర్తి కురియన్ ముమ్మారు తలాక్ అని విడాకులిచ్చే పద్ధతి చెల్లదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ తీర్పే అమలులో ఉంటుంది. అయితే షమీం ఆరాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కేసులో 2002లో తీర్పు చెప్పినప్పుడు సుప్రీం కోర్టు ముమ్మారు తలాక్ పద్ధతి చట్టవ్యతిరేకమని తీర్పు చెప్పిన అంశాన్ని గుర్తుంచుకోవాలి. కాని ఆ నాటి తీర్పు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. మీడియా, రాజకీయ పార్టీలు, పౌర సమామాజం కూడా అంతగా దృష్టి పెట్టినట్టు లేదు.

ఈ తీర్పు లోని సూక్ష్మమైన, సంక్లిష్టమైన, నర్మగర్భమైన అంశాల మీద నెలల తరబడి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆచారాల్లో ముస్లింలు అందరూ ఒకే పద్ధతి అనుసరించే వారు కారు కనక ఈ తీర్పు ప్రభావం ముస్లింలు అందరి మీద ఎటూ ఉండదు. ఇస్లాం మతాన్ని అనుసరించే వారందరూ ఒకటేనన్న ప్రచారం జరుగుతుంది కనక ఈ అంశాన్ని గురించి నొక్కి చెప్పాలి. న్యాయమూర్తులు భిన్నమైన వాదనలు చెప్పి మెజారిటీ తీర్పు చెప్పి ముమ్మారు తలాక్ పద్ధతి చెల్లదని చెప్పారు. కాని కేవలం సున్నీ ముస్లింలలోనే ఈ పద్ధతి ఉందని గమనించాలి.  

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.కేహార్, ఎస్.అబ్దుల్ నాజిర్ చెప్పిన మైనారిటీ తీర్పులోని అంశాలే ఆందోళనకరంగా ఉన్నాయి. ముమ్మరు తలాక్ విధానం సున్నీ ముస్లింల వివాహ చట్టాలలోనే ఉందని, అది వారి మత విశ్వాసంలో భాగమని, దానికి రాజ్యాంగంలోని 25వ అధికరణం రక్షణ కల్పిస్తోందని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనార్టీ తీర్పులో పేర్కొన్నారు. మతాన్ని, వివాహ చట్టాలను ఆ మతానుయాయులు ఎలా అనుసరిస్తారో అలాగే చూడాలని ఈ న్యాయమూర్తులు చెప్పారు. ఆ మతంలోని హేతువాదులు అనుకునేట్టుగా, ఇతరులు అది ఎలా ఉండాలనుకుంటారో అలా చూడకూడదని అన్నారు. ఈ అభిప్రాయమే గనక మెజారిటీ తీర్పు అయి ఉంటే వ్యక్తిగత, వివాహ చట్టాల్లో మార్పు కావలనుకోవడానికి ఆస్కారం ఉండేదే కాదు. వ్యక్తిగత, వివాహ చట్టాల్లో న్యాయవ్యవస్థ మార్పులు చేయకూడదని, పార్లమెంటే ఆ మార్పు తీసుకు రావాలని పిటిషన్ పెట్టుకున్న వారి డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఆ పని ఆరు నెలలలోగా చేయాలని న్యాయమూర్తులు సూచించారు. అయితే ఈ సూచన కూడా నిర్బంధం ఏమీ కాదు. అవకాశం ఉంటే మైనారిటీ తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తుల ఆదేశాలను అనుసరించి బీజేపీ ఉమ్మడి వివాహ చట్టం చేయడానికి హడావుడి చేసి ఉండేది.

కోర్టు తీర్పు వెలువడినందువల్ల మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ముస్లిం సమాజంలో ఉన్న వివక్షను సరిదిద్దాలని కోరే వారిలో ముస్లిం మహిళలకు సంబంధించిన సంఘం కూడా ఉండడం ఇదే మొదటి సారి. ఇది చాలా విశిష్టమైంది. నేర విచారణా ప్రక్రియలోని 125వ సెక్షన్ ప్రకారం 1985లో సుప్రీం కోర్టు విడాకులు పుచ్చుకున్న మహిళలకు భరణం చెల్లించాలని ప్రగతి శీలమైన తీర్పు చెప్పింది. కాని ముస్లిం మత పెద్దల ఒత్తిడికి తలొగ్గి అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల (రక్షణ, విడాకుల) చట్టాన్ని 1986లో ఆమోదించి ఛాందస వాదుల ఒత్తిడికి తలొగ్గింది. ముస్లింల వివాహ చట్టంలో ఏ మార్పు చేసినా ఆ కోర్కె ముస్లింల నుంచే రావాలని  వాదించారు. ముస్లిం మహిళల సమస్యలకోసం పోరాడే మహిళా బృదాలు సైతం ఈ అంశంపై ఒత్తిడి చేస్తే హిందూ మతోన్మాదులు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారని భావించి వెనక్కు తగ్గారు. ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను చూపి హిందూ మతతత్వ వాదులు ఆ మతాన్నే వికృతీకరిస్తారు. కాని ఆ తర్వాత పరిస్థితి చాలా మారింది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం మహిళల పర్సనల్ లా బోర్డు ఏర్పాటు అయింది. ఈ మహిళలు తమ మతంలోని ఛాందసవాదులను ఎదిరించడానికి కూడా సిద్ధపడ్డారు.

ముస్లిం మహిళలు లింగ వివక్షకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న సుధీర్ఘ పోరాటంలో ఈ తీర్పు తొలి విజయం మాత్రమే. కోర్టుకెళ్లిన మహిళలు సంవత్సరాల తరబడి తమ మీద జరుగుతున్న దౌర్జన్యం గురించి, వరకట్న వేధింపుల గురించి తెలియజేశారు. ఈ బాధలు భారతీయ మహిళలు అందరూ ఎదుర్కుంటున్నవే. కోర్టుకెక్కిన మహిళలు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే వ్యవహారాన్నే ప్రస్తావించారు. ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న అనేక రకాల దౌర్జన్యాలకు ఈ తీర్పు ద్వారా నిష్కృతి ఏమీ ఉండదు.

దేశంలో ఉన్న మతత్వ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచి మందుపాతర లాంటి ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే విషయంపై జాగ్రత్తగా తీర్పు చెప్పింది. ఈ తీర్పు ముస్లింలకు, ముఖ్యంగా మహిళలకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. తమ వివాహ చట్టాల్లో ఎలాంటి మార్పులు కావాలో చర్చించడానికి అవకాశం ఇస్తుంది.

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top