ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఇ.పి.డబ్ల్యు సంక్షోభం - ఓ ‘చిన్న గొంతుక’

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ఎకనామిక్ & పొలిటికల్ వీక్లీ (ఇ.పి.డబ్ల్యు) 51 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలో ఒడిదుడుకులు, బలవంతపు మార్పులు ఎదురయ్యాయి. ముఖ్యంగా గత నెలలలో జరిగిన పరిణామాలపై ఇ.పి.డబ్ల్యు. మీద, దాని భవిష్యత్తు మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి. గతంలో ఇ.పి.డబ్ల్యు. ఏం చేసిందో కాక భవిష్యత్తులో కూడా ఏం చేయబోతోందో చర్చించడానికి ఇది సముచిత సమయం. దీని కోసం ఇ.పి.డబ్ల్యు.ను అభిమానించే వారి భాగస్వామ్యాన్ని, పాత్రను ఆహ్వానిస్తున్నాం.

బెర్నార్డ్ డి మెల్లో ఊహాత్మక సంభాషణలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.

ఇ.పి.డబ్ల్యు తో అన్యోన్యత, సామీప్యత కారణంగానే ఇ.పి.డబ్ల్యు. కొనసాగుతోంది. ఈ రెండింటినీ జేంస్ కమెరాన్ సినిమా టైటానిక్ లోని రోజ్, జాక్ పాత్రలుగా ఊహించుకుందాం. 

దోపిడీ దొరలాంటి తన ప్రియుడు కాల్, భర్తను కోల్పోయి తాను ఉన్నత స్థాయికి చెందిన దాన్ని అన్న స్పృహ ఉన్న తల్లి రుత్ ఆదేశించినట్టుగా ఉండడంతో విసిగి వేసారి పోయిన రోజ్ నౌక వెనుక తట్టు వైపు నుంచి దూకి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. "వద్దు నువ్వు అలా చేయకూడదు" అని జాక్ అన్నాడు. "నేను ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పి నన్ను బలవంతపెట్టకు. గత పదిహేనేళ్ల నుంచి నేను నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడు నువ్వెక్కడున్నావ్? వెళ్లు ఇక్కడి నుంచి అని రోజ్ ఆగ్రహంగా అరిచింది.

జాక్: "లేదు నేను నీతోనే ఉన్నాను. నాకు మరో మార్గం లేదు. నువ్వు ఆ పిట్టగోడ నుంచి వెనక్కి రా. నన్ను కాపాడు. రా... వచ్చేయ్. నీ హస్తం అందించు. నువ్వు ఇలా చేయకూడదు."

రోజ్: "నేను అల్లరి పిల్లనని నువ్వు అనుకుంటున్నావేమో."

జాక్: "లేదు. ఎంతమాత్రం కాదు. నీకు మరో దారి లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు అంతు చిక్కడం లేదు."

రోజ్: "గత జనవరి నుంచి నేను ఎలాంటి దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నానో నీకు తెలియదు. నిజానికి నిజమైనది ఏది, నకిలీది ఏది; నైతికమైంది ఏది అనైతికమైంది ఏది అని నిర్ధారించుకోలేని పరిస్థితిలోకి నేను కూరుకు పోయాను. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. నేను దిగజారుడుతనాన్ని సహించలేను. ఒక పెద్ద వ్యాపార సంస్థ నాకు తాకీదు పంపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే...జాక్ నా పరువు మంటగలుస్తోంది."

జాక్: "అవును ఇదంతా చికాకు కలిగించే విషయమే. 2016 జనవరి నుంచి నీ ఇద్దరు సంపాదకులు రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ రోజ్ నువ్వు చాలా అద్భుతమైన దానివి. దిగ్భ్రమ కలిగించే దానివి. నీ అంత ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వం ఉన్న దాన్ని నేను చూడలేదు. నువ్వు బాగుంటావన్న నమ్మకం కలిగే దాకా నిన్ను విడిచి వెళ్ల లేను. రోజ్ నువ్వు ఒక వలలో ఇరుక్కుపోయావు. నీకు స్వేచ్ఛ లేకపోతే manalaevu. నువ్వు పటిష్ఠమైనదానివి కనక అది వెంటనే జరగక పోవచ్చు. కాని కొంతకాలానికైనా నేను నీలో ఏ అగ్నికణాన్ని అయితే ప్రేమిస్తున్నానో అది ఆరిపోతుంది."

రోజ్: "జాక్! నా గురించి యాగీ చేయకు. నేను నా వైఫల్యాల నుంచి ఏం నేర్చుకున్నానో అదే నా వ్యక్తిత్వం. సచిన్ చౌదరి నుంచి సి. రాం మనోహర్ రెడ్డి దాకా సంపాదకులు, రచయియలు నాలో ఏ భావాలైతే కలిగించారో అదే నా వ్యక్తిత్వం. నాకున్న పరిమితులేమిటో నాకు తెలుసు. నా సంపాదకులు, రచయితల సహాయంతోనే నేను "మహాజ్ఞాన వటవృక్షం”గా ఎదిగాను. కాని దీర్ఘ కాలం అత్యంత సమర్థంగా పని చేసిన నా సంపాదకుడు కృష్ణ రాజ్ లాగా నేను సొంత డబ్బా కొట్టుకునే మనిషిని కాను."

జాక్: "పరిశోధనాత్మక పత్రికా రచనా విధానాన్ని అనుసరించినప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా?"

రోజ్: "ఆ ఆలోచన నాకు భలే నచ్చింది. ఈ శతాబ్దారంభంలో అమెరికాలో జరిగిన సంఘటనలపై నేను చదివిన విషయాల గురించి గుర్తు చేస్తాను. 1870 నుంచి 1900 వరకు సంపద కేంద్రీకృతం కావడం వల్ల భయంకరమైన అసమానతలు పెరిగాయి. భలే చౌక బేరం అనుకోవడం వల్ల ప్రభుత్వం భయంకరమైన అసమానతలను పెంచి పోషించింది. ప్రైవేటు సంపత్తి పోగేయడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించింది. అలా అక్రమ పద్ధతుల్లో ధన రాశులను పోగేసుకున్న వారిని దోపిడీ దొరలు అంటారు. ఈ దుర్మార్గం వల్లే బండారం బయటపెట్టే వారు, బండారం బయటపెట్టే పత్రికా రచన అస్తిత్వంలోకి వచ్చాయి. బండారం బయట పెట్టే వారు ఏం జరుగుతోందో తొంగి చూస్తారు. తాము కనిపెట్టిన విషయాలను జనానికి అందిస్తారు. కార్పొరేట్ సంస్థల దగా, రాజకీయ అవినీతి కలిసిపోయాయి. ఈ అంశం మీదే బండారం బయటపెట్టే పత్రికా రచన ఎక్కువగా దృష్టి సారించింది. విషయం తెలుసుకున్న ప్రజలు సమాజంలోని రుగ్మతలకు వ్యతిరేకంగా తిరగబడతారని బండారం బయటపెట్టే వారు భావించారు. 1990 నుంచి భారత్ లో దోపిడీ దొరలకు, శక్తిమంతమైన అవినీతికర రాజకీయ నాయకులకు మధ్య పొత్తు కుదిరింది. ఆ తర్వాత బండారం బయట పెట్టే పత్రికా రచన కూడా రావాల్సిందే. ఈ రకమైన పత్రికా రచన నా పత్రికలో కచ్చితమైన, సాధికారికమైన రీతిలో రావాలని కోరుకున్నాను."

జాక్: "కాని రోజ్! ఏదో కొరత ఉంది. అదీగాక నువ్వు నీ "ప్రధాన సామర్థ్యం" నుంచి వైదొలిగావు."

రోజ్: లేదు లేదు జాక్. మనం యాజమాన్యం మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. ఈ అంశాన్ని గురించి నా సంపాదకీయ బృందం చాలా కాలం కిందటే అంటే బోఫోర్స్ కుంభకోణం సమయంలోనే ఆలోచించింది. పరిశోధనాత్మక పత్రికా రచనలో కచ్చితమైన వాస్తవాల మీద ఊనిక ఉండాలి. దానికి ప్రజా సమస్యలపై అసలైన పరిశోధన కావాలి. అప్పుడే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నాల్గో మూలస్థంభమైన పత్రికా రచనగా విరాజిల్లుతుంది. ఈ కళను అనుసరించాలంటే అనుభవజ్ఞులైన పత్రికా రచయితలు, తగినన్ని నిధులు అవసరం. ప్రస్తుత నయా ఉదారవాద పరిస్థితుల్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల, కార్పొరేషన్ల దుర్వర్తనకు సంబంధించిన సమాచారం బయటపెట్టినప్పుడు నిశ్శబ్దాన్ని పాటించాలి. ఎందుకంటే వ్యాపార మీడియా ఈ అంశాలను పట్టించుకోదు. ప్రశ్నార్థకమైంది పత్రికా స్వేచ్ఛ కాదు. బానిసత్వమే అసలు సమస్య. సాధికారికమైన పరిశోధనాత్మక పత్రికా రచన నా యజమానులను డబ్బు సంచులున్న వారితో, శక్తిమంతమైన రాజకీయ నాయకులతో ఘర్షణకు దిగవలసిన దశకు నెట్టాయి. వారంతా తమ పలుకుబడిని ఉపయోగించి ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. కాని గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే పరిశోధనాత్మక పత్రికా రచన కింద చెలామణి అవుతున్నది ప్రభుత్వం లోని వారు, కార్పొరేషన్ల వారు ఉప్పు అందించడం మీదే ఆధారపడి ఉంది. విలేకరికి వార్తలు అందించే వారు అతనికి గోరుముద్దలు తినిపిస్తారు. వాస్తవాలకు సంబంధించిన వివాదం ఉన్నప్పుడు విలేకరి సత్యాన్వేషణ చేయాలి. కాని చాలా అరుదైన వారు మాత్రమే ఆ పని చేస్తారు. లాభాపేక్ష లేని కార్పొరేట్ సంస్థల కూటమి ద్వారా మేం నిధులు సమకూర్చుకోగలిగాం. అయితే ఇలాంటి నిధుల గురించి ఓ మాట చెప్పాలి. ఇతర ఉదారవాద, ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు లాగే నాకూ ఉదారవాదుల నుంచి, లాభాపేక్ష లేని కార్పొరేట్ సంస్థల కూటమిలో డబ్బున్న వారి నుంచి నిధులు అందాయి. కాని దీనివల్ల నాలో ఉన్న సానుకూలమైన, సమూలమైన మార్పు తీసుకురావాలన్న అంశం పోతుందేమోననిపించింది. నేనూ వారితో కలిసిపోతానేమోనన్న భయం పట్టుకుంది.

జాక్: “రోజ్! భారత పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య హక్కుల సంస్థలు భారత రాజ్య వ్యవస్థ విపరీతంగా, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రధానమైన మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్రంగా పరిశోధన చేశాయి. ముఖ్యంగా అన్యాయాన్ని ఎదిరించడానికి, అందులోనూ రాజ్యవ్యవస్థే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు లోతైన, స్వతంత్ర పరిశోధన చేశాయి. ఈ పరిశోధనలన్నీ భావాల సమీకరణకు, భారత రాజ్య వ్యవస్థ అకృత్యాలకు వ్యతిరేకంగా చైతన్యం రగిలించడానికి తోడ్పడ్డాయి. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థలు కలిసి హూ ఆర్ గిల్టీ అని సంయుక్త నివేదిక వెలువరించాయి. రాజ్యవ్యవస్థ మద్దతుతో 1984 నవంబర్ లో సిక్కులపై జరిగిన దాడుల మీద పరిశోధన చేసి ఈ నివేదిక రూపొందించాయి. ఈ నివేదిక ముసాయిదాలోని కొన్ని భాగాలు నీ పత్రికలో కూడా వచ్చాయి. ఇలా శక్తిమంతంగా బహిర్గతం చేసే చర్యలకు నీ మద్దతు కొనసాగుతుందనుకుంటున్నాను. హూ ఆర్ గిల్టీ నివేదిక వాస్తవాలను వెలికి తీసిన విశిష్టమైన పరిశోధనాత్మక ప్రక్రియ."

రోజ్: "అవును జాక్. మేం కచ్చితంగా మద్దతు కొనసాగిస్తాం. అదృష్టవశాత్తు మా రచయితలు ప్రభుత్వ విధానాలు అత్యధిక సంఖ్యాక ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న విషయం మీదే దృష్టి కేంద్రీకరించారు కాని ఈ విధానాలు కులీన మైనారిటీ వర్గానికి ఎలా తోడ్పడ్డాయి అనే విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే సరైన ఆరోగ్య సదుపాయాలు, గృహవసతి లేని, తమ పిల్లలను అధ్వానమైన పాఠశాలల్లో చేర్పించడం తప్ప గత్యంతరం లేని, నిరంతరం పేదరికంలో మగ్గుతున్న ఈ ఉదారవాద దశలో ఆర్థిక మానవశాస్త్ర దృక్కోణంతో రాసే రచనలు మాకు అంతగా అవసరం లేదు. ఈ కష్టాలన్నింటికీ మూలం దోపిడీ, అణచివేత విధానాలే.

జాక్: "మనం ఈ వారపత్రికలో సగభాగమైన పత్రికా రచన గురించే మాట్లాడుకుంటున్నాం. కాని మిగతా సగభాగమైన పండిత చర్చలు కూడా ప్రధానమైనవే గదా?"

రోజ్: అవును. పరిశోధనాత్మక పత్రికా రచన నేపథ్యం ఉన్న ఏ సంపాదకుడికైనా అది ఓ సవాలే. నిజానికి ఆర్థిక శాస్త్రం చదువుకున్న సంపాదకుడైనా చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించగలరు. తన పరిమితులు ఏమిటో తెలుసుకున్న కొత్త సంపాదకుడు వివిధ సామాజిక శాస్త్రాలతో సంబంధం ఉన్న సంపాదక సలహా మండలిని సంప్రదించి పని చేయాలి. కాని ఈ సంపాదకుడికి ఈ సలహా దార్లతో భావైక్యత, మేథో సంబంధ ఐక్యత ఉంటేనే పత్రికలోని అకడమిక్ వ్యవహారాలలో బాగా పని చేయగలరు. సంపాదకుడు నిరంతరం యువకులైన, శక్తి సామర్థ్యాలు గల, ముఖ్యంగా భారత విద్యాధికుల్లో ఎడంగా ఉన్న వారిని గుర్తించి తన పత్రికకు రాయమని కోరవచ్చు."

జాక్: "నీ తదుపరి సంపాదకుడు ఎలా ఉండాలనుకుంటున్నావు?"

రోజ్: "కనీసం ఉదారవాది అయి ఉండాలి. అలాగని వామపక్షీయుడైన కులీన వర్గానికి చెందిన వాడు కానవసరం లేదు. నా దృష్టిలో ఉదారవాది అంటే నిర్భయంగా, నిష్పాక్షికంగా సత్యం చెప్పే వాడు. దీనికి సాధికారికమైన చరిత్ర జ్ఞానం ఉండాలి. శాస్త్ర పద్ధతికి కట్టుబడి ఉన్న వాడై ఉండాలి. ప్రపంచాన్ని సవిమర్శనాత్మకంగా చూడ గలగాలి. ప్రశ్నించగలగాలి. ఈ సందర్భంలో నాకు వ్యవస్థాపక సంపాదకుడు సచిన్ చౌదరి గుర్తొస్తున్నాడు. రెండవది: సంపాదకుడు తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం పని చేయాలి. తాను చేసే పని ఇతరుల మీద ఎలాంటి ప్రభావం కలగజేస్తుందో తెలిసిన వాడై ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి వ్యక్తీ ముఖ్యమైనవాడే అనుకోవాలి. అప్పుడే ప్రజాస్వామిక, సాపేక్షికంగా సమానత్వంతో కూడిన మా పని సంస్కృతిని పునరుద్ధరించగలడు. కృష్ణ రాజ్, రజనీ దేశాయ్ ఇలాంటి సంప్రదాయాలు నెలకొల్పారు. సి. రాం మనోహర్ రెడ్డి దీన్ని కొనసాగించారు. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే నా సంస్థ విస్తరించింది. అసమతుల్యత, అధికార దొంతర పెరిగాయి. అయినా రాం మనోహర్ రెడ్డి ప్రజాస్వామ్య పని సంస్కృతిని కాపాడారు. ఆ సంస్కృతిని ధ్వంసం చేయాలంటే నియంతృత్వ పోకడలు, అహంకారం ఉన్న వ్యక్తికే సాధ్యం. మూడవది: ఇ.పి.డబ్ల్యులో 'ఆర్థికం' అన్న అంశం కన్నా రాజకీయ, సామాజిక అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ సమతూకాన్ని పునరుద్ధరించాలి. సంప్రదాయ విరుద్ధమైన ఆర్థిక నిపుణుడు సంపాదకుడిగా ఉండాలి. ఓపెన్ వెయిన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా గ్రంథం రాసిన ఉరుగ్వే రచయిత ఎడ్వర్డో గలియానో "మనం నిజాయితీగా రాయడం ప్రధానం. మనం మాట్లాడే మాటలను బట్టే ఒకరినొకరం తెలుసుకుంటాం. నేనంటే నేను మాట్లాడే మాటలే. నేను నీకు ఒక మాట చెప్తున్నాను అంటే నన్ను నీకు వ్యక్తం చేస్తున్నాననే."

జాక్: "నా రోజ్! మహాద్భుతం!! మళ్లీ నువ్వు నువ్వుగా మారాలి. నువ్వు కొనసాగాలి రోజ్. ఈ చీకటి రోజుల్లో నువ్వు మరణించవని నేను నమ్ముతున్నాను. నువ్వు నన్ను నీ వేపు ఆకర్షించినందుకు ధన్యవాదాలు."

రోజ్: అది నీట మునిగిన మంచు ముక్క లాంటిదే. అది ఒక హెచ్చరిక. అది పోయింది. కాని లొంగ లేదు. అది నా వ్యక్తిత్వాన్ని, నా చట్రాన్ని, నా ఉపరితల నిర్మాణాన్ని అంతం చేయడం మొదలెట్టింది. నా సంపాదక మండలి మద్దతు, నీ దన్ను లేకపోతే నేను నాశనమయ్యేదాన్నే. నేను గులాబీలు పూయించాలి."

జాక్: "అవును కచ్చితంగా ఆ పనే చేయాలి. కాని నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. నువ్వు సజీవంగా ఉంటావని మాటివ్వాలి. ఏం జరిగినా, ఎంత దుర్భర పరిస్థితి ఎదురైనా నువ్వు కాడి కింద పడేయనని మాటివ్వాలి."

రోజ్: "నేను ఎప్పటికీ వదలను జాక్. నేను ఎప్పటికీ వదలను. ఇది నా వాగ్దానం.

(టైటానిక్ స్క్రిప్ట్ లోని కొన్ని భాగాలను వినియోగించుకున్నాను. అయితే ఆ సినిమాలో ఉన్న అంశాలను మరీ సాగదీయకూడదు.)

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top