ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

గంజాయి వనంలో తులసి మొక్క

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాల బృందం 2017 జూన్ 23న  ఖతార్ కు పంపిన 13 డిమాండ్లలో ఒకటి అల్ జజీరా టెలివిజన్ నెట్వర్క్ ను మూసేయాలన్నది. ఈ దేశాలు ఖతార్ పై ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాయి. అల్ జజీరాను మూసేయాలని కోరడంలో ఆశ్చర్యం లేదు. తమది "అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి స్వతంత్ర వార్తా చానల్" అని అల్ జజీరా చెప్పుకుంటుంది. ఈ చానల్ ను 1996లో ప్రారంభించారు. ఇది అరబ్ దేశాల రాచరికాలకు, నియతృత్వాలకు పక్కలో బల్లెంలా ఉంది. ఈ వార్తా చానల్ ఖతార్ నుంచే పని చేస్తోంది. అక్కడ మీడియాకు "స్వేచ్ఛ" లేదని 2016లో అమెరికాలోని ఫ్రీడం హౌజ్ తేల్చింది. కాని అల్ జజీరా ఆ ప్రాతంలోని మిగతా మీడియా సంస్థలకన్నా స్వేచ్ఛగానే వ్యవహరిస్తోంది. బి.బి.సి. అరబ్ ప్రసారాలను మూసి వేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సౌదీ అరేబియా దాతృత్వం వల్ల అల్ జజీరా అరబిక్ అవతరించింది. అప్పుడు బి.బి.సి. అరబిక్ లో పని చేస్తున్న 150 మంది సుశిక్షితులైన పత్రికా రచయితలు రాత్రికి రాత్రి అల్ జజీరాలో మూకుమ్మడిగా చేరిపోయారు.

అల్ జజీరా ఇంగ్లీషు చానల్ ను ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తారు. అది సంపూర్ణమైన వృత్తి ప్రమాణాలతో, విశ్వసనీయతతో పని చేస్తుంది. అరబ్ ప్రపంచంలో, ఉత్తర ఆఫ్రికాలో జరుగుతున్న పరిణామాలను పశ్చిమ దేశాల ప్రమాణాలతో ప్రసారం చేసే అంతర్జాతీయ చానళ్లకన్నా నిర్దిష్ట దృక్పథంతో ప్రసారం చేస్తుంది. కాని అల్ జజీరా అరబిక్ విభాగం అరబ్ ప్రపంచంలోని నిరంకుశపాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మీడియా మీద నియంత్రణ ఉన్న ప్రాంతాలవారు ఎన్నడూ తెలుసుకోవడానికి అవకాశం లేని అంశాలను అల్ జజీరా అరబ్ చానల్ ప్రసారం చేస్తుంది. టునీషియా, ఈజిప్ట్ లో "అరబ్ స్ప్రింగ్"ను విస్తారంగా తెలియజేసింది అల జజీరా అరబిక్ చానలే. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని జంట ఆకాశహార్మ్యాలపై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత ఒసామా బిన్ లాదెన్ ను ఇంటర్వ్యూ చేసిన ప్రపంచంలోని వార్తా చానల్ అల్ జజీరా ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల వల్ల అల్ జజీరా ప్రతిష్ఠ పెరిగింది. కాని ఖతార్ కు పొరుగున ఉన్న దేశాలలో అనుమానాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఖతార్ రాజకుటుంబం ఈ చానల్ లో కొంత పెట్టుబడి పెట్టింది. ప్రోత్సహిస్తోంది. ఈ వార్తా చానల్ ముస్లిం బ్రదర్ హుడ్, తదితర తీవ్రవాద బృందాల విషయంలో మెతకగా ఉంటుందని, కైరోలోని తాహిర్ స్క్వేర్ లో జరిగిన నిరసన ప్రదర్శనలను ప్రోత్సహించిందన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణలను అల్ జజీరా గట్టిగా ఖండిస్తోంది. రాడికల్ ఇస్లామిక్ బృందాల వాణి కూడా వినిపించడం తమ వృత్తి ప్రమాణాలలో భాగం అని ఆ చానల్ చెప్తోంది. కాని సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాల బృందం ఈ వాదనను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కావాలనే రెచ్చగొడ్తోందని ఆ దేశాలు అనుకుంటున్నాయి.

ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్-అల్-సిసీని విమర్శించినందుకు అల్ జజీరా కైరోలోని తన కార్యాలయాన్ని, లైవ్ ఈజిప్ట్ చానల్ ను 2013లో మూసైవేయక తప్పలేదు. దోహా నుంచి ప్రసారాలు కొనసాగించినప్పటికీ ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగా ఖతార్ ప్రభుత్వం 2014లో ఆ ప్రసారాలు నిలిపివేయాల్సి వచ్చింది. అంటే "స్వతంత్ర" చానల్ అనుకునే అల్ జజీరా మీద ఖతార్ ప్రభుత్వ ప్రభావం లేకుండా పోలేదు. ఖతార్ రాజ్యాంగంలోని 47వ అధికరణం భావప్రకటనా స్వేచ్ఛ కల్పించినప్పటికీ "పరిస్థితుల ప్రభావం"వల్ల రాచరికం మీద విమర్శలను, ఖతార్ లోని వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికి స్వేచ్ఛ నిరాకరిస్తుంది. ఆరు గల్ఫ్ సహకార దేశాలలో అణచివేసే తత్వం ఉన్న మీడియా చట్టాలను విమర్శించి, ఖతార్ లో మరింత స్వేచ్ఛ కావాలని వాదించినందుకు మీడియా స్వేచ్ఛ దోహా విభాగం డైరెక్టర్ జాన్ క్యూలెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖతార్ లోని శ్రామికులలో 94 శాతం మంది దక్షిణాసియా దేశాల నుంచి వలస వచ్చిన వారే. వీరి పని పరిస్థుతుల గురించి వార్తలు అందించడానికి ఖతార్ అంగీకరించదు.

ఇతర దేశాల వారి ఒత్తిడికి లోంగిపోవాల్సి వచ్చిన మీడియా సంస్థలలో అల్ జజీరా మొదటిది ఏమీ కాదు. దుబై మీడియా సిటీలో జియో, ఎ.ఆర్.వై. వన్ వరల్డ్ అనే రెండు పాకిస్తానీ చానళ్లు పని చేస్తుండేవి. ఈ వార్తా చానళ్ల ప్రసారాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని హామీ కూడా ఇచ్చారు. కాని 2007లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఒత్తిడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం లొంగిపోక తప్పలేదు. వార్తలు మినహా వినోద కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేయడానికి ఈ చానళ్లను అనుమతించారు.

అనేక అంతర్జాతీయ పత్రికా రచయితల సంఘాలు అల్ జజీరా ఇంగ్లీషు చానల్ కు మద్దతు ప్రకటించినప్పటికీ ఈ వార్తా చానల్ ను మూసివేయాలన్న ఒత్తిడి కేవలం పత్రికా స్వేచ్ఛకు పరిమితం అయిన వ్యవహారం కాదు. అల్ జజీరా అననుకూల వాతావరణంలో పెంచే మొక్కలాంటిది. అది పత్రికా స్వేచ్ఛకు అవకాశం లేని చోట పని చేసే వ్యవస్థ. ఆ ప్రాంతంలో ప్రతి దేశంలో ఏకఛత్రాధిపత్యమో, పరిపూర్ణమైన రాచరికమో కొనసాగుతోంది. ఇక్కడి అనేక ప్రభుత్వాల దృష్టిలో మీడియా తమ తరఫున ప్రచారం చేసే పరిచారిక మాత్రమే. నిర్దిష్టమైన హద్దుల్లో పని చేయాల్సి ఉంటుంది. గీత దాటితే తరచు పత్రికా రచయితలను బెదిరిస్తుంటారు. జైళ్లలో పెడతారు. అల్ జజీరా చానల్ ఖతార్ రాజకీయాల విషయంలో ఈ పరిమితులకు లోబడి పని చేసినందువల్లనే అక్కడి ప్రభుత్వం సహించింది.

సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాల బృందం ఆదేశాలను ప్రస్తుతానికి ఖతార్ ప్రభుత్వం ఖాతరు చేయకపోవచ్చు. కాని నిరంతర ఒత్తిడికి లొంగి, రాజీ పడిపోయి అల్ జజీరాను మూసి వేయాలనో, కార్యకలాపాలను తగ్గించాలనో నిర్ణయిస్తే అది దయనీయమన పరిస్థితే. అదే జరిగితే ఈ ప్రాంతానికి, యావత్ప్రపంచానికి అపారమైన నష్టం. ఎందుకంటే పరిమితులు ఎన్ని ఉన్నా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చునని, ఆధిపత్య ధోరణులను ఎదిరించవచ్చునని అల్ జజీరా నిరూపించింది. అల్ జజీరా గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది.

Updated On : 13th Nov, 2017
Back to Top