ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వ్యవసాయ రంగంలో అగ్ని జ్వాలలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

భారతీయ జనతా పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, అపారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, విదేశాల్లో దాచిన నల్లడబ్బు వెనక్కు తెస్తామని ఇలా అనేకానేక వాగ్దానాలు చేసింది. ఎన్నికల వాగ్దానాలకు మన దేశంలో ఏ గతి పడుతుందో అందరికీ తెలుసు. అయితే ఈ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వాలకు మధ్య తేడా ఏమిటంటే తమ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ప్రచారం చేశారు. మామూలుగా అయితే జనం ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోరు. కాని తమ నాయకుడు మొనగాడని, ఊహించలేనంత సమర్థుడని ప్రచారం చేసినందువల్ల ప్రజలు ఇప్పుడు ఈ వాగ్దానాలు ఏమైనాయని నిలదీస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నందుకు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం నెమ్మదిగా కనిపిస్తున్నందుకు బీజేపీ గందరగళోంలో పడిపోయింది.

పదిరోజులపాటు మహారాష్ట్రలో రైతుల చరిత్రాత్మకమైన సమ్మె, మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళన వల్ల దేశం ఆశ్చర్యచకితమైంది. బీజేపీ నిర్ఘాంతపోయింది. ఇంతవరకు తమ అభిప్రాయం బలంగా వ్యక్తం చేయలేని, సంఘటితంగా ఉండని రైతులు అమాంతం గణనీయమైన రాజకీయ శక్తిగా మారిపోయారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరాన్ని సమ్మె చేసిన రైతులు గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, పంటలు విపరీతంగా పండినందువల్ల వ్యవసాయ ఉత్పత్తులకు తగ్గిన ధరల వల్ల ఏర్పడిన లోటు పూడ్చాలని రైతులు గట్టిగా కోరుతున్నారు. రెండేళ్ల పాటు అనావృష్టి కొనసాగిన తర్వాత ఈ ఏడాది పంటలు బాగా పండాయి. అందువల్ల ఈ సారి నీటిపారుదల సదుపాయాలు బాగున్న మహారాష్ట్ర లోని పుణే, నాసిక్ జిల్లాల, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ డివిజన్ రైతులు సమ్మె చేశారు. మహారాష్ట్రలో అనావృష్టికి గురయ్యే మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు, మధ్యప్రదేశ్ లోని చంబల్, బుందేల్ ఖండ్ రైతులు సమ్మె కట్టలేదు. వాతావరణ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడానికి తోడు దేశమంతటా వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతూ ఉంటే పండిన పంటల ధరలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది. మార్కెట్ స్థిరంగా ఉండడం లేదు. వ్యవసాయ కమతాలు చిన్నవై పోయి దిగుబడి తగ్గుతోంది. ఈ కారణాల వల్ల సేద్యం ద్వారా సమకూరే ఆదాయం తగ్గుతోంది. వ్యవసాయం ఏ మాత్రం గిట్టుబాటు కాని వ్యవహారంగా తయారవుతోంది. చిన్న, సన్నకారు రైతులు, కౌలుదార్లు, భూమిలేని వ్యవసాయ కూలీలు, వ్యవసాయంపై ఆధారపడ్డ ఇతరులు విపరీతంగా నష్టపోతున్నారు.

రైతుల నిరసనలను ఎదుర్కోవడంలో ఈ రెండు రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమైనాయి. రైతుల ఆందోళనకు కారణం ప్రతిపక్షాలు ప్రేరేపించడమేనని బీజేపీ ముందు ఆరోపించింది. తద్వారా ప్రతిపక్షాలకు లేని బలం సంతరించి పెట్టింది. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న వారు “నిజమైన” రైతులు కారని చెప్పింది. ఈ రెండు ఆరోపణలూ తిరగబడ్డాయి. మహారాష్ట్రలో రైతులకు ప్రాతినిధ్యం వహించే కీలక సంఘ సభ్యుల మధ్య చీలిక తీసుకురావాడానికి ప్రయత్నించారు. అందువల్ల కొత్త కమిటీ ఏర్పడింది. వామపక్షాలకు చెందిన రైతులు నాయకత్వ స్థానాలలోకి వచ్చారు. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగివచ్చి రూ. 30, 000 కోట్ల మేర చిన్న సన్నకారు రైతు రుణాలను మాఫీ చేయడానికి అంగీకరించక తప్పలేదు. వచ్చే పంటకు కొత్త రుణాలు ఇస్తామన్నారు. పాల ధర గణనీయంగా పెంచారు. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం జోడించి మద్దతు ధర నిర్ణయించడానికి వీలుగా కేంద్రానికి నచ్చ చెప్తామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఈ హామీలు అత్యాశతో కూడుకున్నవి, అమలు క్లిష్టతరమైనవి. ఎందుకంటే నిజంగా రుణమాఫీ అవసరమైన రైతులు ఎవరో, ఉత్పత్తి వ్యయం ఎంతో నిర్ణయించడం అంత సులభం కాదు. ఈ హామీల వల్ల ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. నిజం చెప్పాలంటే గతంలో లాగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ జోక్యానికి దారి తీస్తుంది. బీజేపీ ఈ విధానాన్ని సమర్థించదు. మధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రైతుల సంఖ్య ఏడుకు పెరిగినా ముఖ్యమంత్రి శివరాజ్ సింఘ్ చౌహాన్ అరకొర సహాయక చర్యలు మాత్రమే ప్రకటించారు. వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తామన్నారు. రైతులతో చర్చిస్తామన్నారు. ఇలాంటి చర్యలవల్ల రైతులను సముదాయించడం కుదరక పోగా ప్రతిపక్షాలకు బలం సమకూర్చి నట్టయింది.

ఈ పరిస్థితి ఆంతర్యం ఏమిటంటే బీజేపీ గ్రామీణ ప్రాంతాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే వ్యాపారవర్గాలకు సన్నిహితంగా ఉండే, పట్టణ ప్రాంతాలకు పరిమితమైన బీజేపీ కులాల సమీకరణల కారణంగా, ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చక్క దిద్దుతామన్న హామీలు ఇచ్చినందువల్ల గ్రామీణ ప్రాంతం వారి ఓట్లు సంపాదించగలిగింది. బీజేపీ చేసిన ఈ వాగ్దానాలే ఇప్పుడు ఆ పార్టీని వేటాడుతున్నాయి. సరైన వ్యవసాయ విధానాలు అనుసరించకపోవడం, అన్ని రాజకీయ పార్టీలు సవ్యమైన ఆర్థిక విధానాలు అనుసరించకపోవడం వల్ల ఇప్పుడు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభానికంతటికీ బీజేపీ ఒక్కటే కారణం కాదు. అలా అనలేం కూడా. కాని నిరాశలో ఉన్న రైతులు తమ సమస్యలు తీర్చమని గట్టిగా కోరుతున్న పర్యవసానాలను బీజేపీ ఎదుర్కోక తప్పదు. గతంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన గ్రామీణాభివృద్ధి విధానాలను, మహాత్మా గాంధీ గ్రామీన ఉపాధి హామీ పథకం వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. మరో వైపున బీజేపీ భూ సేకరణ చట్టానికి మార్పులు చేయాలనుకోవడం, పెద్ద నోట్లు రద్దు చేయడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేకపోవడం వల్లే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలు తెలియకపోవడమే. రైతులు “విధిలేక అమ్ముకోవడం” వల్లే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ ఏడు నాటి విధాన ప్రకటనలో అభిప్రాయపడడం ఈ తెలియని తనం వల్లే. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు కొరత ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో, మార్కెట్లలో తీవ్రంగానే ఉంది. దీని వల్ల నగదు చేతికి అందడం లేదు. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రైతులు కూడా ఆందోళనకు సిద్ధం కావడానికి కారణం నగదు చేతికి అందకపోవడమే.

మరాఠా మోర్చాలు ప్రారంభమైన అహమద్ నగర్, పుణే దివిజన్లలోని జిల్లాలలోనే రైతుల ఆందోళనలు ప్రారభమైనాయని చాలా మంది గుర్తించడం లేదు. అనేక ఆందోళనలు, వివిధ డిమాండ్ల మధ్య తేడా ఉండొచ్చు కాని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల వీటి తీవ్రతను ఏ ప్రభుత్వమైనా గ్రహించవలసిందే. ప్రతిపక్షం బలంగా లేనందువల్ల రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రభుత్వానికి కళ్లెం వేయడానికి దోహదం చేసింది. ఈ ఉద్యమాలు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని గుర్తు చేస్తున్నాయి.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top