ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

గో రక్షణ పేర కుటిల రాజకీయాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

గో వధను నిషేధించడానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో కిరాతకమైన చట్టాలు అమలులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో గోవధ నిషేధ చట్టాలు లేవు. ఒరిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో షరతులతో కూడిన నిషేధం ఉంది. ఈ రాష్ట్రాలలో పాలివ్వని, పని చేయడానికి పనికి రాని పశువులను మాత్రమే వధించడానికి అనుమతిస్తారు. 1980ల తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రవచించే కరడుగట్టిన జాతీయవాద విధానాలు అనుసరించినందువల్లే అధికారం దక్కిందన్న విషయం గత మూడేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి బాగా తెలుసు. అందుకని ఇప్పుడు తాము గతంలో ఎన్నడూ అధికారానికి దరిదాపుల్లో లేని రాష్ట్రాలలో కూడా అధికరం సంపాదించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడానికి నీతిబాహ్యమైన రీతిలో ప్రయత్నిస్తోంది. 1960నాటి పశువులపట్ల క్రౌర్యాన్ని నిరోధించే చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పని చేస్తోంది. ఈ చట్టాన్ని సవరించి పశువులను వధించడంకోసం పశువుల క్రయ విక్రయాలు జరగకుండా నిబంధనలను అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పశు వధను నిషేధించాలని ప్రయత్నిస్తోంది.

గో సంరక్షకులం అని చెప్పుకునే ముఠాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొత్త రకం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తీవ్రవాదాన్ని ఆతంక్ వాద్ అంటున్నట్టుగా దీనిని గోతంక్ వాద్ అనవచ్చు. గో సంరక్షకులు చట్టాన్ని తామే అమలు చేసే దుస్సాహసానికి ఒడిగడ్తున్నారు. ఇది హిందుత్వవాద రాజకీయ సంస్కృతిలో భాగమే. ముస్లింలను, దళితులను వేధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. గోవుకు హాని తలపెట్టిన వారిని ఉరి తీస్తామని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డా. రమణ్ సింఘ్ హెచ్చరించారు. గోవును రక్షించడం అంటే ప్రపంచాన్ని ఆధ్యాత్మిక, నైతిక పతనం నుంచి కాపాడడమేనని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అన్నారు. రాజస్థాన్ లో సంతలో పశువులను కొనుక్కుని తీసుకెళ్తున్న పేహ్లూ ఖాన్ ను గో సంరక్షకులు కొట్టి చంపారు. రాజస్థాన్ మంత్రి ఒకరు గోవులను వధించే వారి మీద చర్య తీసుకోవాలని ఆదేశించి గోసంరక్షణ పేరిట జరుగుతున్న ఆగడాలను సమర్థించారు. ఈ వ్యవహారాన్ని చూస్తే మనుషులను హతమార్చడం కన్నా గోవును చంపడమే పెద్ద నేరంగా తయారైంది.

రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో భాగమైన 48వ అధికరణం మత ప్రాతిపదిక మీద గోవులను సంరక్షించాలని చెప్పడం లేదు. వ్యవసాయాం మీద, పశు పాలన మీద ప్రతికూల ప్రభావం చూపేటట్టయితే గోవులను వధించకూడదని ఈ అధికరణం స్పష్టంగా చెప్తోంది. న్యాయ వ్యవస్థకు ఈ విషయం తెలిసినా 2005లో గోవధ మీద సంపూర్ణ నిషేధాన్ని సమర్థించింది. ఈ కేసులో తీర్పు చెప్పిన ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచి ఆవులు, వృషభాలు పాలివ్వకపోయినా, పని చేయడానికి పనికి రాకపోయినా వాటి పేడ బయో గ్యాస్ తయారీకి, మూత్రం ఔషధాల తయారీకి పనికి వస్తుందని చెప్పారు. గోవును మాతగా భావించే మతపరమైన భావన ఈ తీర్పును ప్రభావితం చేయలేదని ఎవరైనా అనగలరా?

పాలివ్వని, వ్యవసాయానికి పనికి రాని పశువులను సైతం వధించగూడదనడం వనరులను (పశువులను మేపడం) వృధా చేసినట్టు కాదా? శక్తి ఉడిగిన పశువులు నెమ్మదిగా చనిపోవడానికి అవకాశం కల్పించడం అంటే ప్రజలకు జీవనోపాధి, ఆహారం దొరకకుండా చేయడం కాదా? పశువులను వధించకూడదని నిషేధం విధిస్తే గొడ్డు మాంసం తినే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, చాలా మంది హిందువులు వారానికి ఒక సారో, రెండు సార్లో ఈ మాంసం తిని పౌష్ఠికాహరం తీసుకోవడానికి అడ్డు తగలడం కాదా? చౌకగా దొరికే గొడ్డు మాంసం వల్లే వీరికి మాంసకృత్తులు సమకూరుతాయి. పశువులపట్ల క్రౌర్యాన్ని నిరోధించే చట్టాన్ని సవరించి చేర్చిన కొత్త నిబంధనలు రాజ్యాంగంలోని 48వ అధికరణంలో పొందుపరిచిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణమైనవిగా కనిపించడం లేదు.

హిందూ మతం మోక్షం సంపాదించడం కోసం ఉద్దేశించిన కొన్ని విశ్వాసాల, నమ్మకాల సముచ్ఛయం. కాని ప్రస్తుత ప్రధానమంత్రి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది, ప్రోత్సహిస్తున్నది ఈ విధమైన హిందూ మతం కాదు. అది కరడుగట్టిన హిందూత్వం. అది సంపూర్ణమైన రాజకీయ అధికారం సంపాదించి నిర్దిష్టమైన హిందుత్వ విధానాలను అమలు చేయడానికి ఉద్దేశించింది. కొత్తగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు ఈ రకమైన హిందూత్వాన్ని నమ్మని, అనుసరించని వారి జీవనోపాధికి, జీవన విధానానికి అడ్దు తగిలేవి మాత్రమే. హిందువుల మత అభిప్రాయాలను వినియోగించుకుని ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందువల్ల ఓట్లు దండుకోవాలని చూస్తోంది. తద్వారా కొన్ని శాసన సభలకు జరగనున్న ఎన్నికలలో, 2019లో లోక సభకు జరిగే ఎన్నికలలో ప్రయోజనం పొందాలని అనుకుంటోంది.      

ఈ కొత్త నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవని న్యాయస్థానాల్లో సవాలు చేయడం ఖాయం. వీటిని న్యాయస్థానం కొట్టేయవచ్చు కూడా. అప్పుడు వైదిక సంస్కృతి నెలకొల్పడానికి న్యాయవ్యవస్థ అడ్డుతగులుతోందని బీజేపీ యాగీ చేస్తుంది. వాస్తవం ఏమిటంటే వేద కాలంలోనూ, ఆ తర్వాత గోవును పవిత్రమైందిగా భావించలేదు. ఆ కాలంలో గోవధ నైతికమైన, చట్టపరమైన అతిక్రమణ కింద పరిగణించలేదు. నిజానికి క్రీ.పూ. 1500 నుంచి క్రీ.పూ. 600 దాకా "భారత్" లో గోమాంస భక్షణ సర్వసాధారణం. చరిత్రలో ఈ భాగాన్ని హిందుత్వవాదులు వాటంగా మరుగున పడేశారు. వారికి ఈ కఠిన వాస్తవాలు మింగుడు పడవు. ప్రభుత్వం అమలులోకి తెస్తున్న కొత్త నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి మాత్రమే కావు, హిందూ వ్యతిరేకమైనవి కూడా. 

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top