ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మహిళల మధ్య వివక్ష ఎందుకు?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని తగ్గించే ఉద్దేశంతో కార్మిక చట్టాలకు సవరణలు చేస్తున్న దశలో ఈ ఏడాది ఆరంభంలో 2017నాటి ప్రసూతికి సంబంధించిన (సవరణ) చట్టం ఆమోదించడం ఆహ్వానించదగిన పరిణామం. 1961నాటి ప్రసూతి ప్రయోజనాల (సవరణ) చట్టాన్ని లోక సభలో సవరించడం ద్వారా మహిళలకు 26 వారాలపాటు ప్రసూతి సెలవు ఇవ్వడం సాధ్యం అవుతుంది. ఇంతకు ముందు ఈ సెలవు 12 వారాలు మాత్రమే ఉండేది. చట్టంలో ఇలాంటి మార్పులు ప్రశంసనీయమైనవి. అయితే ఇలాంటి చట్ట సవరణలు విస్తారమైనవి కాకపోవడం, గొప్ప ప్రయోజనాలు కలిగించేవి కాకపోవడం గమనించదగిన అంశం. ఈ సవరణల వల్ల నిజంగా ప్రయోజనం అవసరమైన వారికి ఆ సదుపాయం దక్కడం లేదు. విచిత్రం ఏమిటంటే ఈ చట్టం సవరణల వల్ల ప్రయోజనం కలగక ముందే ప్రసూతి ప్రయోజనం కలిగించే పథకం (ఇది సవరించిన చట్టం కాదు అని గుర్తించాలి) కింద అర్హులైన వారికి ప్రయోజనం అందకుండా చేశారు. అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడం అన్న మాట. ఈ పథకంలో చేసిన అనేక మార్పులు మహిళా కార్మికులలో బలహీన వర్గాల వారి పట్ల వివక్ష చూపించడానికి ఉద్దేశించినవి.

సవరించిన ప్రసూతి ప్రయోజనాల పథకం వ్యవస్థీకృత రంగంలో పని చేసే కోటి 80 లక్షల మంది మహిళలకు వర్తిస్తుంది. పది మంది కన్నా ఎక్కువ మంది పని చేసే సంస్థలన్నింటికీ వర్తింస్తుంది. 50 మంది ఉద్యోగులను లేదా 30 మంది మహిళలను నియమించుకునే చోట ఆఫీసులోనే లేదా 500 మీటర్ల పరిధి లోపల శిశు సం రక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. శిశువులు ఉన్న మహిళా కార్మికులను ఆ శిశు సం రక్షణా కేద్రానికి రోజుకు నాలుగు సార్లు వెళ్లనివ్వాలి. యజమాని అంగీకరిస్తే, చేసే పని ఇంటి దగ్గరనుంచే చేయగలిగింది అయితే ఇంటి దగ్గరే ఉండి పని చేసే అవకాశం కలిగించాలి. జీతంతో కూడిన ప్రసూతి సెలవు వినియోగించుకున్న తర్వాత ఇంటిదగ్గర నుంచే పని చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి. అద్దె గర్భం భరించే మహిళలకు, మూడు నెలలలోపు శిశువును దత్తత తీసుకునే వారికి కూడా 12 వారాల పాటు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి. ప్రసూతి సెలవు వల్ల తల్లి పాలు ఇస్తారు కనక శిశు మరణాలు తగ్గుతాయని అనేక సర్వేల్లో తేలింది. తల్లిపాల వల్ల శిశువుకు మెరుగైన ఆహారం అందుతుంది. తల్లి కోలుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మన దేశంలో మహిళలకు ఉపాధి కల్పించడంలో ఉన్న సామాజిక-ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటే యజమానులు మహిళలను నియమించుకోవడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్న భయంతో అసలు వారిని నియమించుకోవడానికే వెనుకాడుతారు. ప్రసూతి ప్రయోజన పథకం కూడా దీనికి అతీతం కాదు. ప్రభుత్వం పూర్తిగానో, పాక్షికంగానో నిధులు సమకూర్చని సంక్షేమ పథకాలన్నింటికి సంబంధించినంతవరకు ప్రైవేటు రంగం, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారు ఈ ఖర్చులు భరించడం దండగ అనుకుని అసలు మహిళా ఉద్యోగులను నియమించుకోవడమే మానేస్తారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం 2005 నుంచి భారత కార్మికులలో మహిళల సంఖ్య 10 శాతం దగ్గింది. కాని శిశు సం రక్షణాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల, జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఎక్కువ కాలం ఇచ్చినందువల్ల వ్యవస్థీకృత రంగంలో మహిళలు ఉద్యోగాలు వదిలేయరు అన్న ఆశాభావం ఉన్న వారు ఉన్నారు.

అయితే ప్రసూతి ప్రయోజన పథకం మొత్తం మహిళా కార్మికులలో 90 శాతం మందికి వర్తించదు. ఎందుకంటే వీరు అవ్యవస్థీకృత రంగంలో లేదా వ్యవసాయ కార్మికులుగానో, ఇళ్లల్లో పని మనుషులుగానో పని చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ మాటకొస్తే క్రమంగా ప్రైవేటు రంగ ఉద్యోగులకు 15 రోజుల పాటు మగ వారికి కూడా వారి భార్యల ప్రసవ సమయంలో సెలవు తీసుకోవడానికి అర్హత ఉందన్న విషయాన్ని ఈ పథకం రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు. అంటే దీనివల్ల శిశు పోషణ కేవలం మహిళల బాధ్యతే అన్న పితృ స్వామ్య భావనను ఈ పథకం సమర్థిస్తుందన్న మాట.

ప్రసూతి ప్రయోజన పథకం గురించి 2016 డిసెంబర్ 31 న ప్రధానమంత్రి అట్టహాసంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఇచ్చే సొమ్ము నెలకు ఆరు వేలకు పెంచుతామని ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఈ పథకం కింద సహాయం అందించడాన్ని మొదటి ప్రసవానికి మాత్రమే పరిమితం చేసింది. అదీ పుట్టిన శిశువు సజీవంగా ఉంటేనే. ఏమైనప్పటికీ ఈ పథకం ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన (ఐ.జి.ఎం.ఎస్.వై) పేర 50 జిల్లాలలో 2010 నుంచి అమలులో ఉంది. 2017నాటి ప్రసూతి ప్రయోజన పథకం విచక్షణతో కూడుకుని ఉందని ఈ రంగంలోని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఐ.జి.ఎం.ఎస్.వై. లో ఈ ప్రయోజనాన్ని ఇద్దరు పిల్లల దాకానే వర్తింప చేయడం, పెళ్లి చేసుకునే వయసును పరిగణనలోకి తీసుకోవడం లాంటి నిబంధనలను తొలగించాలని కూడా ఈ కార్యకర్తలు అంటున్నారు. అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారితో సహా మహిళలందరికీ ప్రయోజనం కలిగేలా చూడాలని గట్టిగా కోరుతున్న సమయంలో ప్రసూతి ప్రయోజన పథకం ఒక శిశువు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధన తిరోగమన చర్యే అవుతుంది.

శ్రామికులలో మహిళల భాగస్వామ్యం అన్ని చోట్లా ఉంది కనక ప్రసూతి ప్రయోజన పథకం మన దేశంలోనే కాక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా రెండంచుల కత్తి లాంటిదే. లాంఛనప్రాయమైన రంగంలో పని చేసే మహిళలకు ప్రయోజనం కలిగించేప్పుడు మహిళలు ఉద్యోగాలు చేయడం శిక్ష అనుభవించడానికి కాదు అన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రయోజనాలు లాంఛనప్రాయమైన, అవ్యవస్థీకృత రంగంలోని వారికి కూడా వర్తించాలి.

 

 

 

 

 

  

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top