విదేశాల నుంచి తగ్గుతున్న చెల్లింపులు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
విదేశాలలో పని చేసే వర్ధమాన దేశాలకు చెందిన వారు తమ దేశానికి డబ్బు పంపించడం 2015-16లో తగ్గింది. 2016వ సంవత్సరంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఇలా పంపే మొత్తం కూడా 2.4 శాతం తగ్గింది. 2015లో ఇది ఒక శాతం తగ్గింది. కాని భారత్ లో ఇది 9శాతం తగ్గింది. విదేశాల్లో పని చేస్తూ స్వదేశానికి డబ్బు పంపే భారతీయుల సంఖ్య ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా అధికం. విదేశాల నుంచి చెల్లింపులు తగ్గే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇది కరెంట్ అకౌంట్ ఖాతా మీద ప్రభావం చూపడమే కాక విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా తగ్గవచ్చు. ఈ ప్రభావం కేరళ లాంటి రాష్ట్రాల మీద ఎక్కువ ఉంటుంది. పశ్చిమాసియాలోనూ ఇతర దేశాల్లోనూ పని చేసే కేరళ రాష్ట్రం వారి సంఖ్య ఎక్కువ. ప్రభుత్వం విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నప్పటికీ విదేశాలలో పని చేసే వారు పంపే డబ్బు తగ్గడం వల్ల తీర్వ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే విదేశీ ప్రైవేటు పెట్టుబడుల వల్ల దేశానికి జరిగే మేలు ఆట్టే ఉండదు.
వలసలు-చెల్లింపులు అన్న పేర వలసలు, అభివృద్ధిపై అంతర్జాతీయ విజ్ఞాన భాగస్వామ్య సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం మన దేశానికి విదేశీ చెల్లింపులు తగ్గాయని తేలింది. ఈ సంస్థను వివిధ దేశాలకు ఆర్థిక సహాయం చేసే దేశాలు ఏర్పాటు చేశాయి. దీనికి ప్రపంచ బ్యాంకు నుంచే కాక జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్ నుంచి నిధులు అందుతాయి. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత వర్ధమాన దేశాలకు విదేశీ చెల్లింపులు తగ్గినా మళ్లీ పుంజుకున్నాయని ఈ సంస్థ నివేదికలో తెలియజేశారు. కాని అనేక కారణాల వల్ల ఈ విదేశీ చెల్లింపులు మళ్లీ తగ్గాయి. ముడి చమురు ధర తగ్గడం, గల్ఫ్ సహకార మండలి దేశాలు, రష్యాలో ఆర్థికాభివృద్ధి మందగించడం, విదేశీ మారక ద్రవ్య రేట్లలో హెచ్చు తగ్గులు మొదలైన కారణాల వల్ల ఈ చెల్లింపులు తగ్గాయి. నైపుణ్యం తక్కువగా ఉన్న కార్మికులు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే సంస్థలకు విపరీతంగా డబ్బు చెల్లించవలసి రావడం, డబ్బు తమ దేశానికి పంపించే ఖర్చు ఎక్కువగా ఉండడం కూడా విదేశీ చెల్లింపులు తగ్గడానికి కారణం అని తమ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి చేసిన సర్వేలో తేలిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. స్వదేశానికి డబ్బు పంపడానికి 7.5 శాతం దాకా రుసుము చెల్లించవలసి వస్తోంది. దీనికి తోడు సంపన్నమైన దేశాలని అనుకుంటున్న పశ్చిమాసియాలో భారత కార్మికులు దుర్భరమైన జీవితం గడపవలసి వస్తోంది.
విదేశాల నుంచి స్వదేశానికి పంపే డబ్బు ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆసరాగా ఉంటుంది. విదేశీ మారక ద్రవ్య రేటు నిలకడగా ఉండడానికి ఉపకరిస్తుంది. 2014లో ఈ పరిస్థితి బాగున్నప్పుడు భారత్ కు 7000 కోట్ల డాలర్లు విదేశీ చెల్లింపుల ద్వారా అందితే చైనాకు 6400 కోట్ల డాలర్లు సమకూరాయి. విదేశీ చెల్లింపుల ద్వారా డబ్బు అందుకునే వారు గృహనిర్మాణం వంటి కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. అయితే ఆర్థిక అసమానతలు పెరగడం, కార్మికులు అందుబాటులో లేకపోవడం, లింగ సమానత్వం కొరవడడం లాంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. విదేశాల నుంచి డబ్బు పొందే వారు బ్యాంకు ఖాతాలు తెరుస్తారు కనక వారికి ఆర్థిక సేవలు అందుతాయని ప్రపంచ బ్యాంకు లాంటి బహుళపక్ష ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయి. కాని ఆర్థిక శాస్త్ర పండితులు, పరిశోధకులు ఈ అభిప్రాయాలు అంగీకరించడం లేదు. విదేశీ చెల్లింపులు అసమానమైన ఆర్థికాభివృద్ధికి దారితీస్తాయన్నది వారి అభిప్రాయం. "స్వయం సహాయక అభివృద్ధి" వల్ల పేదలపై భారం పడుతుందని వీరు భావిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే భారత్ విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. ఏడాదిపాటు మందకొడిగా ఉన్న ఎగుమతులు గత కొద్ది నెలలుగా మెరుగు పడ్డాయి. రిజర్వూ బ్యాంకు అందజేసిన లెక్కల ప్రకారం 2016 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఉన్న పరిస్థితిని అంతకు ముందు సంవత్సర పరిస్థితితో పోల్చి చూస్తే కరెంట్ అకౌంట్ లోటు, వాణిజ్య లోటు తగ్గాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలూ పెరిగాయి. మూడేళ్లుగా చమురు ధరలు తక్కువగా ఉన్నాయి కాని ఇవి ఎప్పుడూ అలాగే ఉండకపోవచ్చు. స్టాక్ మార్కెట్ లో విదేశీ పెట్టుబడులు కుంచించుకుపోయాయి. మన దేశంలో పెట్టిన పెట్టుబడిపై లాభాలను, వడ్డీని, డివిడెండ్లను తరలించుకుపోవడంతో ఎగుమతుల పెరుగుదలు ముఖ్యంగా సాఫ్ట్ వేర్, సమాచార సాంకేతికత ఆధారిత సేవలలో ఎగుమతులు ఆందోళనకరంగా తగ్గాయి. అమెరికాలో రక్షణాత్మక విధానాలు అనుసరిస్తున్నందువల్ల ఈ ధోరణి ఇంకా కొనసాగుతుంది. మధ్య కాలికంగా అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ దేశాలకు భారత ఎగుమతులు పెరుగుతాయన్న ఆశ లేదు.
విదేశాల నుంచి చెల్లింపులు తగ్గడానికి విస్తృతమైన ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూడాలి. విదేశీ చెల్లింపులు వర్ధమాన దేశాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్ లో కూడా ఈ ప్రభావం ఉంది. తాత్కాలికంగా వేదేశాలకు వెళ్లి పని చేసే వారు, అంతగా నైపుణ్యం లేని కార్మికులు విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపుతున్నారు. ఉత్తర అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న వారు ఎక్కువగా స్వదేశానికి డబ్బు పంపుతుంటారు. ఇటీవల హెచ్ వన్ బి వీసాల మీద ఆంక్షలు విధించినందువల్ల ఈ చెల్లింపులు తగ్గే అవకాశం ఉంది. ఇలా పంపే డబ్బుతో ఆస్తులు, ఇళ్లు కొనే వారు.
మొత్తం మీద విదేశాల నుంచి పంపించే డబ్బు తగ్గడానికి కారణాలు మన ప్రభుత్వం చేతిలో లేవు. కాని ఇది ఆందోళనకరమైన పరిస్థితే.