ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రతిపక్షాలు ఏకం కాగలవా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

జులై 25లోగా జరగవలసి ఉన్న రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడానికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావడం సాధ్యమేనా? అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్ లో లాగా బీజేపీకి వ్యతిరేకంగా మహా ఘట్ బంధన్ (విస్తృత ప్రతిపక్షాల ఐక్యత) సాధ్యం అయ్యేట్టు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే రాష్ట్రపతి ఎన్నికలలో అధికారి పార్టీని ఓడించవచ్చునన్న అభిప్రాయం ఉంది. కాని రాజకీయాలు ఎన్నికల సమీకరణల లాంటివి కావు. రాజకీయ పార్టీలలో ఉన్న అంతర్గత విభేదాలు, వివిధ ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఆ పార్టీల ప్రాంతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే సమీప భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగులు పడాల్సింది ఏమీ లేదు.

ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్షాలకు మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నాయకత్వం వహించేటట్టయితే సమాజ్ వాదీ పార్టీతో కలిసి పని చేయడానికి అభ్యంతరం లేదని బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి.) నాయకురాలు మాయావతి సూచనప్రాయంగా చెప్పారు. కాని అఖిలేశ్ యాదవ్ మీద ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయి శివపాల్ యాదవ్ దాడి చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే 1993 లో మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. పైగా 1995 జూన్ రెండున ములాయం సింగ్, శివపాల్ యాదవ్ అనుచరులైన సమాజ్ వాదీ పార్టీ గూండాలు తన మీద దాడి చేసిన సంఘటనను మాయావతి మరిచిపోగలరా అన్నది పెద్ద ప్రశ్న.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి కూడా మాయావతి పరిస్థితి లాంటిదే. ఆమెకు వామపక్ష ఫ్రంటుకు నాయకత్వం వహిస్తున్న సి.పి.ఐ.(ఎం) తో కక్షలున్నాయి. 1991 లో సి.పి.ఐ. (ఎం) కు చెందిన గూడాలుగా భావిస్తున్న వారు చేసిన దాడిలో మమతా బెనర్జీ తలకు గాయాలయ్యాయి. కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అటు వామపక్ష ఫ్రంటుకు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కు కూడా శత్రు పక్షమే. ఒక వేళ జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరినా ఈ పార్టీలు 2019 ఎన్నికలు ఒక పార్టీపై మరో పార్టీ పోటీ చేయకుండా ఉంటాయా? అది ఆలోచించవలసిన అంశమే.

అన్నా డి.ఎం.కె. గందరగోళ స్థితిలో ఉంది కనక తమిళనాడులో పట్టు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తనకు బద్ధ శత్రువైన డి.ఎం.కె.తో అన్నా డి.ఎం.కె. సఖ్యంగా ఉండే అవకాశమే లేదు. ఒరిస్సాలో నాలుగు విడతలుగా ముఖ్యమంత్రిగా ఉన్న బిజూ జనతా నాయకుడు నవీన్ పట్నాయక్ ను బీజేపీ వెంటాడుతోంది. బీజేపీకి వ్యతిరేకమైన ఏ కూటమిలో అయినా భాగస్వామిగా ఉండే కాంగ్రెస్ తో పొత్తు కలవడం రాజకీయంగా నవీన్ పట్నాయక్ కు గిట్టుబాటు అయ్యే అంశం కాదు. దాని వల్ల బీజేపీ అనుకూలంగా ఓట్లు సమీకృతం అవుతాయి. కేరళలో కూడా ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ ఐక్యమయ్యే అవకాశాలు లేవు.

1967, 1977, 1989లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత ఉండేది. సోషలిస్టు నాయకులైన డా. రాం మనోహర్ లోహియా, మధు లిమయే నాయకత్వంలో వామ పక్షాలు, అప్పటి జన సంఘ్ కూడా ఏకమై 1967లో ఉత్తరాదిలో కాంగ్రెస్ ను ఓడించగలిగాయి. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977 మార్చిలో కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అయినాయి. 1989 డిసెంబర్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీని, వామపక్షాలను తాత్కాలికంగానైనా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఐక్యం చేయగలిగారు. కాని అప్పటి పరిస్థితి వేరు. రాజకీయ కార్యక్రమం లేకుండా కేవలం వ్యక్తుల మీదే ఆధారపడితే ఆ ఐక్యత క్షణభంగురమైందిగా మిగిలిపోవడమే కాకుండా ప్రతికూల ఫలితాలు ఇస్తుందని చరిత్ర నిరూపిస్తోంది. ఉదాహరణకు అప్పటిదాకా అధికారంలో ఉన్న బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజపేయికి జనాదరణ అమితంగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ "భారత్ వెలిగిపోతోంది" అన్న భ్రమలో పడిపోయినందువల్ల కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యూ.పి.ఎ.) 2004లో అధికారంలోకి రాగలిగింది.

కాంగ్రెస్ విముక్త భారత్ అన్న మోదీ కల ఇంకా సంపూర్ణంగా నెరవేరవలసే ఉంది. 2018 కర్నాటక శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ నష్టపోయినా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్త్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం "అతి పురాతనమైన" కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. 2019 ఎన్నికల లోగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం ఆ పార్టీకే ప్రయోజనకరం. కాని కాంగ్రెస్ కేవలం ఆ ఊహలకే పరిమితమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో భాగస్వామి కాకపోతే బీజేపీ వ్యతిరేక, యూ.పి.ఎ. వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడుతుందని ఎవరైనా ఊహించగలరా? ఈ విషయంలోనూ జవాబుల కన్నా ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

బిహార్ లో కుదిరిన విస్తృత ప్రతిపక్షాల ఐక్యత మిగతా రాష్ట్రాలలో ఏర్పడడం కష్టమే. అయినప్పటికీ మతతత్వ, మెజారిటీ మతం వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీలను ఎదుర్కోవడానికి నానా రకాల పార్టీలు ఎమీ చేయలేం అని కాడి కింద పడేయాల్సిన అవసరం ఏమీ లేదు. మోదీ నిర్నోరధక శక్తిని నిలవరించడానికి కార్యక్రమాలను, విధానాలను రూపొందించడం మర్చిపోవాలని ఎక్కడా లేదు. దేశంలో మొట్ట మొదటి సారి సైద్ధాంతికంగా సమీకృతమైన ఒకే ఒక పార్టీకి లోక సభలో సంపూర్ణమైన మెజారిటీ ఉంది. వ్యక్తులకు ప్రాతినిధ్యం ఉండే మాట నిజమే అయినా రాజకీయాలు వాటిని అధిగమించగలగాలి. బీజేపీని సమర్థంగా ఎదిరించాలంటే ఆ పార్టీని వ్యతిరేకించే వారు భారత్ తరఫున గొంతు విప్పి మాట్లాడాలి. ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఆవిష్కరించగలగాలి. విభిన్నమైన విధానాలను, కార్యక్రమాలను రూపొందించగలగాలి.

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top