ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కశ్మీర్ సమస్య స్వయంకృతాపరాధమే

పార్లమెంట్ ఉపఎన్నికలను బహిష్కరించినట్టు ఉండడం రాజ్య వ్యవస్థతో తీవ్రనిరాశకు చిహ్నం

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

కశ్మీర్ ఎన్నికలలో ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయడం అక్కడి ప్రజల మనోభావాలకు చిహ్నం అని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. ఎంత మంది ఓటు వేశారు అని చూశాం తప్ప ఎంతమంది ఓటు వేయలేదు అన్న అంశాన్ని పట్టించుకోలేదు. మొరటైన అధికార బలంతో ప్రజలను దుడ్డుకర్రతో మోదినా కశ్మీరీ ప్రజలు వచ్చి ఓటేస్తారని ఇంతకాలం నమ్మించారు. ఏప్రిల్ 9వ తేదీన శ్రీనగర్ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేవలం 7.14 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం, ఆ రోజు జరిగిన హింసాకాండ, ఎనిమిది మంది నిరసనకారుల మృతి, మరో 200 మందికి గాయాలు గమనిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. కశ్మీరీ ప్రజలు భారత రాజ్యాంగ వ్యవస్థలతో సంపూర్ణంగా నిరాశతో ఉన్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కశ్మీర్ లో స్థానిక సంస్థలకు, శాసన సభకు, లోక సభకు జరిగే ఎన్నికలలో ఓటర్ల ఆసక్తి భిన్నంగా ఉంటోందని గుర్తుంచుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమేంటు ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి చాలా తక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవస్థల మీద, వీటి రాజకీయ ప్రయోజనం మీద కశ్మీరీ ప్రజలకు ఉన్న నమ్మకం ఏమిటో తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే వారికి స్థానిక సమస్యల మీద పట్టింపు ఉందని అనుకోవాలి. రాష్ట్ర శాసన సభ ఎన్నికల మీద అంతో ఇంతో ఆసక్తి ఉంటోంది. అంటే దశాబ్దాలుగా రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించకుండా అణచివేత కొన సాగడాన్ని కొంత మేరకైనా రాష్ట్ర ప్రభుత్వం నిలవరించగలుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు భిన్నమైనవి. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఏకపక్షంగా ప్రకటిస్తూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ పై తమకు హక్కు ఉందని పునరుద్ఘాటిస్తూ 1993లో భారత పార్లమెంటు తీర్మానించిన దగ్గర నుంచి కశ్మీరీ ప్రజలకు భారత పార్లమెంటుపై విశ్వాసం సడలింది. అదే సమయంలో కశ్మీరిల మీద సైనికపరమైన అణచివేత కొనసాగింది. కశ్మీరీ ప్రజల ప్రాజాస్వామ్య హక్కులను కూడా ఉపేక్షించారు. కశ్మీర్ లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ప్రస్తుత భారత ప్రభుత్వం గానీ, గతంలోని ప్రభుత్వాలు గాని లేశమాత్రమైన ఆసక్తి అయినా చూపించలేదు. రాజ్యాంగబద్ధమైన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి మంగళం పాడి, ఈ అంశాన్ని 1964లో పార్లమెంటు గొప్పగా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు కశ్మీర్ లో స్వయంప్రతిపత్తి అన్న వాదనను ఖాతరు చేసే వారు ఎవరూ లేరు. ఆ మాటకొస్తే  భారత్ లోనే లేరు.

అందువల్ల ప్రభుత్వ తర్కం ప్రకారమే చూసినా 1998 నుంచి కశ్మీర్ లో పార్లమెంటు ఎన్నికల మీద ఆసక్తి తగ్గింది. 70 నుంచి 80 శాతం మంది ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. 2014లో 74 శాతం మంది పార్లమెంటు ఎన్నికల మీద ఆసక్తి కనబరచక పోతే ఇప్పుడు 93 శాతం మంది పార్లమెంటరీ ఎన్నికలను ఉపేక్షించారు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ని ప్రభుత్వనికి అనుకూలుర సంఖ్య విపరీతంగా తగ్గుతోంది. "తీవ్రవాదమా-పర్యాటకమా" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని  మతోన్మాదులను, యుద్ధోన్మాదులను ఆకట్టుకుంటూ ఉండొచ్చు కాని కశ్మీర్ లో దీనివల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. కశ్మీర్ లో జరుగుతున్న సకల దుష్ట పరిణామాల వెనక పాకిస్తాన్ హస్తం ఉందని తాను సృష్టించిన కల్పిత కథలను ప్రభుత్వం తానే నమ్మి ప్రచారంలో పెట్టడం విషాదకర పరిణామం. కశ్మీర్ పరిస్థితికి విరుగుడు పర్యాటనం అభివృద్ధి చేయడం, యువతకు ఉపాధి తాయిలాలు చూపడమే మార్గమన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కూడా ఎవరూ నమ్మడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల్లో బాగా ఆరితేరిన వారు, కొంతమంది కేంద్ర మంత్రులు, ఒక మాజీ జాతీయ సలహాదారు, భారత సైనిక జనరళ్లు ఈ విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. భారత సైనికుల దేశీయ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తున్న వారు అంటున్నారు. దురదృష్టవశాత్తు దిల్లీ ప్రభుత్వం కశ్మీర్ విధానం విషయంలో ఏ మాత్రం వివేకం ప్రదర్శించడం లేదు.

కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ చేతిలో పావులుగా మారుతున్నారని, వారు తమ ముస్లిం తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించే విధాన నిర్ణేతలు, ప్రజాభిప్రాయాన్ని మలిచే వారు భారత రాజ్య వ్యవస్థ దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా మారిందన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. జమ్ము-కశ్మీర్ వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షుడు రాకేశ్ గుప్తా రోహింగ్యాలను, బంగ్లాదేశ్ ముస్లింలను "గుర్తించి చంపేయండి" అని పిలుపు ఇచ్చిన విషయాన్ని విస్మరించలేం. గుప్తా ప్రకటన ఏదో ఒక వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయం కాదు. ఇది దేశంలో అనేక ప్రాంతాలలో ప్రతిధ్వనిస్తున్న ముస్లిం వ్యతిరేక భావాలకు నిదర్శనం.

కశ్మీర్ వీధుల్లో నిరసన, ఆగ్రహం, ధిక్కరణ తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయని గమనించాలి. బుల్లెట్లకు, చిన్న చిన్న తుపాకీ గుళ్లకు బలైపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ భారత ప్రభుత్వానికి సాయుధ మిలిటెంట్ భాష మాత్రమే అర్థం అవుతుందన్న భావన అక్కడి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరిగిపోతోంది. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతాలకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. తుపాకీ చేతబుచ్చుకుని తమ వారిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న హిందూ మెజారిటీ ప్రభుత్వంతో సయోధ్య తమ అస్తిత్వానికే ప్రమాదం అన్న భావన కశ్మీర్ ప్రజల్లో గూడు కట్టుకుంది. వందో రెండు వందలో ఇస్తే తుపాకీ చేతపట్టుకుని ప్రాణాలు అర్పించడానికి యువకులు సిద్ధపడడం లేదు. మరో మార్గం లేనందువల్ల, ఈ పద్ధతిలో తప్ప తమ ఆజాదీ ఆకాంక్షను పట్టించుకునే వారెవరూ లేరన్న అభిప్రాయమే కశ్మీర్ యువత సాయుధ ప్రతిఘటనకు సిద్ధపడడానికి కారణం. 

జమ్మూలో గో రక్షకుల కార్యకలాపాలు, "కల్లోలిత ప్రాంతంలో" బహిరంగంగా ఆయుధాలు పట్టుకుని తిరగడానికి గోరక్షకులకు, వారి మూకలకు ఆర్.ఎస్.ఎస్. అనుమతించడం, 2014 సెప్టెంబర్ నాటి భారీ వరదలవల్ల నష్టపోయిన వారికి సహాయం అందించకపోవడం, 2016 జులై 8న బుర్హాన్ వనీని హతమార్చిన సందర్భంగా పెల్లుబికిన నిరసన బాధితులకు సహాయం అందించకపోవడం మొదలైనవన్నీ కశ్మీరీ ప్రజల ఆగ్రహానికి, నైరాశ్యానికి కారణం.

కశ్మీర్ సమస్యకు కారణం మనమే అని పాకిస్తాన్ కాదని భారత ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ అన్నా, భారత పౌర సమాజం అన్నా తీవ్రమైన నిరాశ కశ్మీరీ ప్రజలలో ప్రబలి పోతోందని గుర్తించాలి. 93 శాతం మంది ఎన్నికలను బహిస్కరించడం ద్వారా అందించిన సందేశం ఇది.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top