ప్రజాస్వామ్యం కొరవడిన పార్లమెంటు
పార్లమెంటు సంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలిగించిన 2017 ఆర్థిక బిల్లు
ఈ ఏడాది ఆర్థిక బిల్లు ద్వారా దాదాపు 40 కేంద్ర బిల్లులను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులతో చర్చించడం మీద విశ్వాసం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పరిశీలన జరపడం మీద కూడా నమ్మకం లేదు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరపడం, డబ్బు, అస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి వాటిపై చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలా అపరిమితంగా సోదాలు మొదలైనవాటిని నిర్వహించడాన్ని ఈ ప్రభుత్వానికన్నా ముందు ఉన్న ప్రభుత్వం "పన్నుల తీవ్రవాదం" అని దుయ్యబట్టేది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూరే విధానం దాపరికం లేకుండా ఉండాలని గంభీరమైన మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం చివరకు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించి కార్పొరేట్ రంగ ప్రయోజనాలకు దాసోహం అయిన రీతిలో వ్యవహరించింది.
2017 ఆర్థిక బిల్లును ప్రభుత్వం ద్రవ్య బిల్లుగా ప్రతిపాదించడం వల్ల ఉభయ సభలు ఉండే మన పార్లమెంటరీ వ్యవస్థలో దిగువ సభ అయిన లోక సభకు తిరుగులేని ఆధిపత్యం అబ్బుతుంది. 2016 నాటి ఆధార్ బిల్లును (ఇప్పుడు అది 2016 ఆధార్ చట్టం) లోక సభ స్పీకర్ ద్రవ్యబిల్లుగా వర్గీకరించడాన్ని సవాలు చేస్తూ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నిర్ణయం ఇంకా వెలువడాల్సే ఉన్నప్పటికీ ఆధార్ చట్టం ఆమోదించేశారు. ఏది ద్రవ్య బిల్లు అన్న అంశంలో స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమమైంది అని చెప్పే రాజ్యాంగం లోని 110 (3) అధికరణం షరతులను ఖాతరు చేయకుండా స్పీకర్ 2017 ఆర్థిక బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించడం సమర్థించదగింది కాదు. పన్నులు విధించడం, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వం రుణాలు, ప్రభుత్వం ఇచ్చే హామీలు, వీటికి సంబంధించిన అంశాలు ఉండే బిల్లునే ద్రవ్య బిల్లుగా పరిగణించాలని రాజ్యాంగంలోని 110 (1) అధికరణం స్పష్టం చేస్తోంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగ చూస్తే ఆర్థిక బిల్లులు సాధారణంగా ద్రవ్య బిల్లుల వర్గీకరణలోకి వస్తాయి. కాని 2017 ఆర్థిక బిల్లు ఈ అంశాలన్నింటిలో అనేక రకాలుగా పరిధులను అతిక్రమించింది.
ఈ బిల్లు 2013 నాటి కంపెనీల చట్టం లోని 182వ సెక్షన్ ను సవరించడానికి కూడా ఉద్దేశించింది. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థలు కాని ప్రైవేటు సంస్థలు కాని ఇప్పటి దాకా తమ లాభాలలో 7.5 శాతం దాకా రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇవ్వ వచ్చు అని ఉంటే ఇప్పుడు సవరణ ద్వారా ఎంతైనా ఇవ్వడానికి వీలు కల్పించారు. ఇంతకు ముందు కంపెనీలు 5 శాతం విరాళంగా ఇవ్వడానికి అవకాశం ఉండేది. చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళం ఇచ్చింది కూడా చెప్పల్సి వచ్చేది. ప్రస్తుతం తీసుకు వచ్చిన సవరణ ప్రకారం విరాళాలపై పరిమితి లేదు. ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చింది కూడా తెలియజేయాల్సిన పని లేదు.
1956 నాటి కంపెనీల చట్టానికి 1985లో సవరణ తీసుకు రావడానికి ముందు కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం మీద నిషేధం (1960 నుంచి 1969 మధ్య మినహా) ఉండేది. ఎన్నికల సంస్కరణలను అధ్యయనం చేసిన అనేక కమిటీలు కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలను "పెట్టుబడి" గా పరిగణించి ఆ తర్వాత భవిష్యత్తులో "లాభం" కోసం చూస్తాయని చెప్పాయి. అలాంటి విరాళాలవల్ల ఆ కంపెనీలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయని వివిధ కమిటీలు భావించాయి. ప్రస్తుత ప్రభుత్వం చేసిన చట్ట సవరణలు ఈ ఆలోచనలకు పూర్తిగా విరుద్ధమైనవి. ఇవి రాజకీయాలకు, వ్యాపార వర్గాలకు మధ్య ఉన్న లంకెను మరింత పటిష్ఠం చేస్తాయి. అజ్ఞాత విరాళాలను ప్రోత్సహించడం వల్ల కార్పొరేట్ సంస్థల విరాళాలు మరింత దాపరికంతో కూడినవి అయిపోతాయి. వీటి మీద పర్యవేక్షణ, బాధ్యత వహించడం కూడా ఉండదు. 2013 కంపెనీల చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వ ప్రతిపాదనలకు రాజ్యసభ మళ్లీ సవరణలను ఆమోదించినప్పటికీ లోక సభ వాటిని తిరస్కరించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఆమోదింప చేయడానికి వీలుగా ప్రభుత్వం చడీ చప్పుడూ లేకుండా 2016 నాటి ఆర్థిక బిల్లును సవరించింది. తద్వారా లండన్ లోని వేదాంత లాంటి వ్యాపార బృందాలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఇచ్చిన విరాళాలు అక్రమమైనవని కోర్టు చెప్పిన తర్వాత విదేశీ కార్పొరేట్ సంస్థలు అంటే నిర్వచనాన్నే మార్చేశారు.
కొన్ని ట్రిబ్యునళ్లను ఇతర ట్రిబ్యునళ్లతో విలీనం చేసే సవరణ కూడా ఆందోళన కలిగించేదే. దీనివల్ల ప్రత్యేక నైపుణ్యం ఉన్న ట్రిబ్యునళ్లను ఏకీకరించినందువల్ల తమ నైపుణ్యాలకు కట్టుబడి ఉండకుండా ఉండడమే కాకుండా అంతకు ముందే ఉన్న ట్రిబ్యునళ్లపై భారం పెరుగుతుంది. మరీ ముఖ్యమైంది ఏమిటంటే ట్రిబ్యునళ్ల సభ్యులను నియమించడంలో, అవి పరిశీలించవలసిన అంశాలను ఖరారు చేయడంలో, సభ్యులను తొలగించడంలో ప్రభుత్వం తన పరిధులను అతిక్రమించడానికి అవకాశ వస్తుంది. అందువల్ల హై కోర్టులకు ఉన్న అధికారాలే ఉన్న న్యాయ సదృశ ట్రిబ్యునళ్ల స్వతంత్రతకు భంగం కలుగుతుంది. ఇలాంటి సంస్థలకు నియామకాలలో కార్యనిర్వాహక వర్గం జోక్యం ఉండకూడదు. 2014లో సుప్రీం కోర్టు ఈ విషయమే చెప్పింది. ఎందుకంటే చాలా సందర్బాలలో ఈ ట్రిబ్యునళ్ల ఎదుట ప్రభుత్వమే కక్షీదారుగా ఉంటుంది. ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయ వ్యవస్థను సంప్రదిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి రాజ్య సభలో హామీ ఇచ్చినప్పటికీ అది మాత్రమే సరిపోదు.
1961 నాటి ఆదాయపు పన్ను చట్టానికి చేసిన సవరణలు కూడా ఆందోళనకరమైనవే. ఈ సవరణల వల్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారమైతే సాధికారత ఉన్న అధికారులు మాత్రమే "విశ్వసించడానికి కారణం" ఉన్నప్పుడే సోదాలు నిర్వహించడానికి, ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి 1962 నుంచి అధికారం ఉంది. సోదా చేసే అధికారాన్ని సవాలు చేసినప్పుడు సదరు అధికారి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎదుట కాని మరే వ్యవస్థ ఎదుట కాని సోదా చేయడానికి కారణాలను వెల్లడించనవసరం లేదు. ఇది కిరాతకమైన చర్య. అధికారులకు నిరంకుశంగా వ్యవహరించడానికి వీలు కల్పించడమే. ఈ అధికారాలను వారు ఎవరినైనా వేధించడానికి తమ ఇష్టానుసారం వినియోగిస్తారు. ఈ అన్ని అంశాలపైన రాజ్యసభ ప్రతిపాదించదలచిన సవరణలను లోక సభ తిరస్కరించింది.
ఈ సవరణల మౌలికాంశాల మీద చర్చించడానికి అవకాశం ఉన్నప్పటికి ఉభయ సభలు ఉండే పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యసభకు ఉన్న రాజ్యాంగబద్ధ పాత్రను తృణీకరించడం చాలా ఆందోళన కలిగించే అంశం. రాజ్య సభలో తమకు మెజారిటీ లేని స్థితిలో ప్రభుత్వం ద్రవ్య బిల్లుల రూపంలో ఇలాంటి చట్టాలు ఆమోదింప చేసుకోవడం సర్వ సాధారణం అయిపోతోంది. లోక సభలో విపరీతమైన మెజారిటీ ఉన్న ఏ పక్షమైనా సమతుల్యత కాపాడడానికి రాజ్య సభకు ఉన్న అధికారాన్ని కాలరాయడమే అవుతుంది. ఏ పద్ధతినైనా అనుసరించి తమ లక్ష్యాలు సాధించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలగజేస్తోంది.