ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

డాక్టర్లకు రోగులకు మధ్య వైరం

వైద్యులకు రోగులకు మధ్య కలహాలు రేపుతున్న నాసి రకం ప్రజారోగ్యం

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

వైద్యులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. రోగులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో అయిదు వేర్వేరు సంఘటనల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ల మీద దాడులు జరిగాయి. వైద్యులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దిల్లీ, సూరత్, అహమదాబాద్, బులంద్ షహర్, చెన్నైలో కూడా గత రెండు మూడేళ్లలో ఇలాంటి సంఘటనలే జరిగాయి. డాక్టర్ల మీద దౌర్జన్యానికి పాల్పడడం భారత్ కు మాత్రమే ప్రత్యేకమైంది కాదు. భారత ఉపఖండంలో, చైనాలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని లాన్సెట్, బ్రిటిశ్ మెడికల్ జర్నల్ రాశాయి.

ఈ దాడులన్నింటి వెనక ఉన్న సామాన్య లక్షణం ఇవి ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండే వనరులు తక్కువ. ఎక్కువ మందికి వైద్యం చేయవలసి వస్తుంది. డాక్టర్లు ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల మీద పని భారం ఎక్కువగా ఉంటుంది కనక వారు రోగులతో, ఆందోళన పడుతున్న రోగుల బంధువులతో సహానుభూతి చూపి పని చేయలేరు. భారత వైద్య మండలి 2015 నాటి సర్వే నివేదిక ప్రకారం 500 మంది డాక్టర్ల అభిప్రాయాలు సేకరిస్తే అందులో 75శాతం మంది తాము దాడులో, వేధింపులో ఎదుర్కున్నామని చెప్పారు.

వైద్యులకు పని భారం ఎక్కువగా ఉంటే రోగులు, వారి బంధువులు డాక్టర్లు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, ఆసుపత్రి సిబ్బంది సహకరించడం లేదని, రోగ నిర్ధారణ పరికరాలు తగినంతగా లేవని, అత్యవసరమైన మందులు ఉండడం లేదని, రోగుల పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని అంటున్నారు. వీటన్నింటివల్ల వారి వారి ఆందోళన ఇనుమడిస్తోంది. బయటి నుంచి మందులు కొనుక్కోవాలని, ప్రైవేటు వైద్య సంస్థల నుంచి ఇతర సేవలు పొందాలని చెప్తున్నందువల్ల రోగులు, వారి బంధువులు చికాకు పడుతున్నారు.

ఆసుపత్రులలో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసరంగా చికిత్స చేయాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రోగులు, వారి బంధువులు డాక్టర్లు అద్భుతాలు చేయాలని ఆశిస్తారు. చాలా సందర్భాలలో స్థానికి 'నాయకులు' తమ వారికి వెంటనే వైద్యం చేయాలని కోరతారు. దాడులకు దిగుతారు. వనరులు లేని దుర్భర పరిస్థితులలో డాక్టర్లు నడ్డి విరిగేట్టు పని చేయవలసి వస్తుంది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఇటీవల డాక్టర్లు నిరంతరాయంగా 36 గంటలు పని చేయాల్సి వచ్చింది. వారికి 'విశ్రాంతి’ దొరికేదల్లా సదుపాయంలేని వసతి గృహాల్లోనే.

వైద్యులు 'ప్రాణ ప్రదాతలు ' అన్న అభిప్రాయం కూడా వేగంగా మారుతోంది. వైద్య సదుపాయాల్లో ప్రైవేటీకరణ, వాణిజ్య ధోరణి ప్రబలి పోతోంది. ప్రైవేట్ డాక్టర్లు పట్టించుకోవడం లేదని, రోగులను సరిగ్గా చూడడం లేదని, డబ్బులు పిండుతున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి అననుకూల పరిస్థితులలో కూడా బాగా పని చేసే డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం సడలుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల పరిస్థితి విషమించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లడం వల్ల, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స సరిగా చేయకుండా, ఎక్కువ డబ్బులు వసూలు చేయడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తోంది.

డాక్టర్ల మీద దాడులు జరగకుండా వారికి రక్షణ కల్పించడానికి 14 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. కాని వాటి అమలు అన్ని చోట్లా సవ్యంగా లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలొ వైద్య సేవలు అందించే వ్యక్తులు, సంస్థల (దౌర్జన్య నిరోధం, అస్తుల నష్టాన్ని నివారించే) చట్టం 2010లో అమలులోకి వచ్చింది. డాక్టర్ల మీద దాడి చేయడాన్ని జామీనుకు వీలులేని అంశంగా ఈ చట్టం పరిగణిస్తుంది. అలా చేసిన వారికి మూడేళ్ల జైలు, రూ. 50,000 జరిమానా విధించడానికి అవకాశం ఉంది. ఆసుపత్రి ఆస్తులకు నష్టం కలిగించిన వారు రెండు రెట్లు నష్ట పరిహారం చెల్లించాలన్న నిబంధనా ఈ చట్టంలో ఉంది. గత మూడేళ్ల కాలంలో డాక్టర్ల మీద దాడులకు సంబంధించిన 53 కేసులు నమోదయ్యాయి. కాని ఒక్క సందర్భంలో కూడా ఎవరికీ శిక్ష పడలేదు. దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలున్న వారందరికీ జామీను మంజూరైనట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు జరిగిన తర్వాత చాలా ఆసుపత్రులు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉదాహరణకు దిల్లీలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో సగటున నెలకొక దాడి జరిగిన నేపథ్యంలో 'మల్ల యోధులను' నియమించారు. గత ఆరేళ్ల కాలంలో దాడులు జరిగిన 20 సందర్భాలలో వైద్యులు, వైద్య సిబ్బంది పని చేయడం ఆపేశారు. భద్రత పెంచడం అరకొర చర్యగానే మిగిలిపోతోంది. నిజానికి ఇలాంటి భద్రతా ఏర్పాట్ల వల్ల డాక్టర్లకు, సమాజానికి మధ్య అగాథం మరింత పెరిగిపోవచ్చు. పరిస్థితి నానాటికి దారుణంగా మారుతున్నందువల్ల రోగుల బంధువులతో సరిగ్గా వ్యవహరించాలని తమతో పాటు పని చేసే జూనియర్ డాక్టర్లకు సీనియర్లు చెప్తున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పని చేస్తున్నాయి.

వైద్య విద్య ఈ సమస్యను అంతగా పట్టించుకోదు. ఒక వేళ పట్టించుకున్నా డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగుల సామాజిక-ఆర్థిక నేపథ్యాన్ని పట్టించుకోనందువల్ల పరిస్థితి మరింత విషమిస్తోంది. రోగులు, వారి బంధువులకు నచ్చ చెప్పే డాక్టర్ల అవసరం ఉంది కాని అది మాత్రమే సరిపోదు. ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు కనక నిర్మాణాత్మకంగా మరింత విస్తృతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సదుపాయాలకు మన దేశంలో కేటాయించే మొత్తం లేశ మాత్రమే. రోగులకు, డాక్టర్లకు మధ్య నిష్పత్తి చాలా దారుణంగా ఉంది. మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలలో ఈ దామాషా మరింత అద్వానంగా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోలాగా సంక్షోభం తలెత్తినప్పుడు అరకొర చర్యలు తీసుకుంటారు. ఆరోగ్య రంగానికి ఎక్కువ మొత్తం కేటాయించడం, ప్రభుత్వ ఆసుపత్రులను విస్తరించడం, మరింత సమర్థంగా వైద్యం అందించడం వంటి సమస్యలను పరిష్కరించకపోతే డాక్టర్లకు రోగులకు మధ్య వైరం కొనసాగుతూనే ఉంటుంది. 

 

 

Updated On : 13th Nov, 2017
Back to Top